Let's talk: editor@tmv.in
మాట తప్పినందుకు ఎవరిని ఉరితీయాలి?: కేటీఆర్

మాట తప్పినందుకు ఎవరిని ఉరితీయాలి?: కేటీఆర్

Gaddamidi Naveen
5 జనవరి, 2026

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అశోక్‌నగర్ అడ్డాపై 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని కేటీఆర్ అన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంపై వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ ఇచ్చి హామీపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో హరీష్ రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, సీఎం వైఖరిని ఎండగట్టారు.కేసీఆర్, హరీష్ రావులను ఉరి తీయాలంటూ ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అశోక్ నగర్ అడ్డాగా 2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను వంచించినందుకు, రైతులకు రుణమాఫీ చేస్తామని మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఎన్నిసార్లు ఉరి తీయాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు. అమలు కాని 420 హామీలతో ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ పార్టీని వందల సార్లు ఉరి తీసినా తప్పులేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అనుచితమైన, జుగుప్సాకరమైన భాషను ఉపయోగిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. స్పీకర్ ఈ పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండడం బాధాకరమని ఆయన విమర్శించారు.రేవంత్ రెడ్డి తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి ప్రవర్తనకు దిగుతున్నారని అందరికీ స్పష్టంగా అర్థమవుతోందని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, విమర్శల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ నేతలు దూషణల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.