
మాజీ సైనికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది : గవర్నర్ అబ్దుల్ నజీర్
రాష్ట్రంలోని మాజీ సైనికులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సైనిక్ వెల్ఫేర్ విభాగం పూర్తిగా కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తెలిపారు.
లోక్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో శుక్రవారం జరిగిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులకు ప్రతి భారతీయుడి హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. సైనికులు చేసిన త్యాగాలు వారి కుటుంబాలు భరించిన బాధలు ఎప్పటికీ మరచిపోలేమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సైనిక్ వెల్ఫేర్ శాఖ కలిసి మాజీ సైనికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. పెన్షన్లు, వైద్య సేవలు, ఉపాధి అవకాశాలు, విద్యా సహాయం వంటి అంశాల్లో మాజీ సైనికులకు పూర్తి మద్దతు అందించడమే లక్ష్యమని తెలిపారు.
దేశ సార్వభౌమత్వం, సమగ్రత రక్షణలో సాయుధ దళాల పాత్ర అత్యంత కీలకమని గవర్నర్ పేర్కొన్నారు. సైనికుల వీరత్వం, కర్తవ్యనిష్ఠ, క్రమశిక్షణ దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. ఫ్లాగ్ డే సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు, వీరమరణాలు పొందిన జవాన్ల కుటుంబాలకు సమాజం అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గవర్నర్ ‘మార్గదర్శి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో మాజీ సైనికులకు అందుబాటులో ఉన్న అన్ని సంక్షేమ పథకాల వివరాలను సులభంగా అర్థమయ్యే విధంగా పొందుపరిచినట్లు తెలిపారు. ఈ పుస్తకం మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
అనంతరం వీరమరణాలు పొందిన సైనికుల కుటుంబాలు, గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు, ప్రతిభ కనబరిచిన మాజీ సైనికులను గవర్నర్ సన్మానించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సైనిక అధికారులు, మాజీ సైనిక సంఘాల ప్రతినిధులు, వీర జవాన్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
