
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు.. 14 రోజుల రిమాండ్!
శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడికి ఆశ్రయం కల్పించడం, పోలీసుల దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం ఆయనను కోర్ట్‌లోన్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఆయనకు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడి అనంతరం మరణించాడు. ఈ ప్రమాదానికి కారణమైన మోటార్‌సైకిల్‌ను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు నడుపుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కుమారుడికి లైసెన్స్ లేదని పోలీసుల ఆరోపణ
ఈ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. అప్పలరాజు కుమారుడికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలిసినా మోటార్‌సైకిల్ నడిపేందుకు అనుమతించారని ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత అసలు నిందితుడి గుర్తింపును మార్చే ప్రయత్నం చేశారని, మరో వ్యక్తిని నిందితుడిగా చూపించేలా వ్యవహరించారని పేర్కొన్నారు.
తప్పుడు సమాచారం.. నిందితుడికి ఆశ్రయం
పోలీసుల కథనం ప్రకారం, ప్రమాదం అనంతరం అప్పలరాజు పోలీసులకు తప్పుడు సమాచారం అందించడమే కాకుండా, కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తన కుమారుడికి ఆశ్రయం కల్పించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల వద్ద సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు వంటి పలు కీలక సాక్ష్యాలు ఉన్నాయని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ ఆధారాల ఆధారంగానే అప్పలరాజుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్తత
అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసుల విధులకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించారని ఎస్పీ ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడంతో సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించకుండా అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కుమారుడు జ్యుడీషియల్ రిమాండ్‌లో
ఈ రోడ్డు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అప్పలరాజు కుమారుడిని ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాదం, అనంతర పరిణామాలు, దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నాలపై పోలీసులు సమగ్రంగా విచారణ కొనసాగిస్తున్నారు.
