Let's talk: editor@tmv.in
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్‌

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్‌

Panthagani Anusha
3 ఫిబ్రవరి, 2026

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్‌ కోర్టు 14 రోజుల న్యాయ నిర్బంధం విధించింది. శనివారం గుంటూరులో చోటుచేసుకున్న తీవ్ర హైడ్రామా అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి న్యాయాధికారి ఎదుట హాజరుపర్చగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రిమాండ్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదనంతరం అంబటిని పోలీసుల భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులు ఆయనను జైలు అధికారులకు అప్పగించారు.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు రోడ్డులోని గోరంట్ల వద్ద తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై ‘మహాపాపం’ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని శుక్రవారం అంబటి రాంబాబు పరిశీలించి 24 గంటల్లో దానిని తొలగించాలని హెచ్చరించారు. మరుసటి రోజు ఉదయం గోరంట్ల వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం తిరిగి వెళ్తుండగా టీడీపీ శ్రేణులు ఆయనను అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా అంబటి తన కారులో నుంచే ముఖ్యమంత్రిపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారని, ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఉద్రిక్తత నెలకొందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కూటమి శ్రేణులు అంబటి కారుపై దాడి చేయగా పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. అయితే అంబటి పోలీసుల మాట వినకుండా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారని కారు అద్దం దించి మరీ పరుష పదజాలం వాడారని పోలీసుల నివేదికలో పేర్కొన్నారు.

ఈ ఘటనపై గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్సై కె.రామకృష్ణ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అంబటిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలో బ్యానర్ల తొలగింపుకు ప్రయత్నించడంపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 126(2), 132 కింద, అలాగే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 196(1), 352, 351(2) కింద కేసులు బుక్ చేశారు.