Let's talk: editor@tmv.in
మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై దేశద్రోహం కేసు

మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై దేశద్రోహం కేసు

Pinjari Chand
2 నవంబర్, 2025

బంగ్లాదేశ్‌ రాజకీయాలు కుదుపునకు లోనవుతూనే ఉన్నాయి. 2024 లో షేక్ హసీనా పదవీచిత్యురాలైనప్పటి నుంచి ఆమె చుట్టూ అనేక కేసులు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఎన్నో దశాబ్దాలుగా ఆ దేశ రాజకీయాలను తన పట్టు లో ఉంచుకున్న మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఇప్పుడు దేశద్రోహి అంటూ అధికారిక ప్రకటన వెలువడింది. సీ‌ఐడి తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం హసీనా, ఆమె అనుచరులు సుమారు 260 మంది పరారీలో ఉన్నట్లు ఆ దేశ వార్తా పత్రికల్లో ప్రకటించారు. బంగ్లాదేశ్‌ రాజకీయ చరిత్రలో పెద్ద మలుపు. ‘జయ్‌ బంగ్లా బ్రిగేడ్‌’ పేరుతో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ వేదిక ద్వారా దేశ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో హసీనా చిక్కుల్లో పడ్డారు. ఢాకా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ది డైలీ స్టార్, అమర్ దేశ్ పత్రికల్లో అధికార ప్రకటన వెలువడింది.

జయ్‌ బంగ్లా బ్రిగేడ్‌: ఒక నిబద్ధతా? లేక అజెండా

హసీనా అనుచరులుగా చెప్పుకునే ఈ వేదిక సభ్యులు, ఆమె తండ్రి షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ వారసత్వాన్ని కాపాడడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. కానీ దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ వేదిక ద్వారా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, తదితర సంఘటితంగా చేసిన కుట్రల ఆధారాలు బయటపడ్డాయి. ఈ బ్రిగేడ్‌ వెబ్‌సైట్‌లో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ అధిపతి నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ మొహమ్మద్‌ యూనస్‌పై విదేశాల్లో ఉన్న హసీనా అనుచరులు ‘డిజైనర్‌ ఆఫ్‌ మాబ్‌ జస్టిస్‌’, ‘టెర్రరిజం సహకారి’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

డిజిటల్‌ ఆధారాలు... ఫోరెన్సిక్‌ విశ్లేషణ

సీఐడి అధికారుల ప్రకారం సోషల్‌ మీడియా పోస్టులు, సర్వర్‌ డేటా, ఆన్‌లైన్‌ చాటింగ్‌ వివరాలను పరిశీలించి 286 మందిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ జాబితాలో మాజీ ప్రధాని హసీనా పేరు కూడా ఉంది. విచారణాధికారి జాసిమ్‌ ఉద్దీన్‌ ఖాన్‌ సంతకంతో నోటీసును ప్రచురించారు.

హసీనా పాలన.. అంతరంగపు అసంతృప్తి

హసీనా నాయకత్వంలోని ఆవామీ లీగ్‌ ప్రభుత్వంపై విద్యార్థులు, పౌర సమాజం, మైనార్టీలు చాలా కాలంగా ఆగ్రహంతో ఉన్నారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం తారస్థాయికి చేరి హసీనా రాజీనామాకు దారి తీసింది. అనంతరం ఆమె దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

దీంతో యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపట్టింది. కానీ హసీనా శిబిరం మాత్రం దీనిని ‘అమెరికా మద్దతుతో చేసిన కుట్ర’గా ప్రచారం చేస్తోంది.

నవంబర్‌ 13 – తీర్పు దినం

బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేర న్యాయస్థానం హసీనా మీద మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై విచారణను పూర్తి చేసింది. నవంబర్‌ 13న తీర్పు వెలువడనుంది. ఆమెపై అధికార దుర్వినియోగం, చిత్రహింసలు, మనుషుల అదృశ్యాలు వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

ఈ పరిణామం ఏం సూచిస్తోంది ?

బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. హసీనా పాలనలో అణచివేతకు గురైనవారు న్యాయం పొందుతారా? అన్నది ఒకవైపు ప్రశ్నగా మారగా యూనస్‌ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుందా? అన్న అనుమానం మరోవైపు తలెత్తుతోంది. రాజకీయంగా చూస్తే ఇది కేవలం హసీనా అంతం మాత్రమే కాదు. ఆవామీ లీగ్‌ వారసత్వ భవిష్యత్తుపై తలెత్తుతున్న ప్రశ్న కూడా.

మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై దేశద్రోహం కేసు - Tholi Paluku