
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సీఎం
దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం (ఎర్త్ సైన్స్ వర్సిటీ) ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభించారు. ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాలలో భాగంగా నెలకొల్పిన ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. దీనిని ఇకపై ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా వ్యవహరిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, వాకిటి శ్రీహరి తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరు దశాబ్దాల క్రితం తెలంగాణ స్వరాష్ట్ర ఆశయం తొలిసారిగా పునాది వేసుకున్న ప్రాంతం ఇదేనని గుర్తుచేశారు. తెలంగాణ ఆత్మీయ కోరికను నిజం చేసిన నాయకుడిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ కి తమ నివాళి అర్పించేందుకు యూనివర్సిటీకి వారి పేరును పెట్టామని తెలిపారు. దేశాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించిన దూరదృష్టి ఉన్న ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగం, నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని సీఎం చెప్పారు. ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉన్న భద్రాద్రి–కొత్తగూడెం, సింగరేణి వంటి సంస్థలతో గుర్తింపు పొందిన ప్రాంతంలో భూవిజ్ఞాన పరిశోధనలకు విస్తృత అవకాశాలు ఉన్నందునే ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని వివరణ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయం, అభివృద్ధి రంగాలకు నూతన ఊపు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను దేశంలోని అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం విద్య, సాగు నీరు, పరిశోధన రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
