
మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలకు హైడ్రా వివరణ
మూసీ నదీ తీరంలో ఆదిత్య బిల్డర్స్ చేపడుతున్న నిర్మాణాలపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఖండించారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను వివరిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
మూసీ నది గర్భంలో ఆదిత్య బిల్డర్స్ చేపట్టిన నిర్మాణాలపై పలు అనుమానాలు వచ్చాయని.ఈ సందర్భంలో గండిపేట్ తహశీల్దార్‌కు లేఖ రాసినట్లు రంగనాథ్ తెలిపారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా, డెమ్ నివేదిక ప్రకారం ఏర్పడిన సందేహాలను తహశీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమాధానం ఇవ్వాలని కోరాం. కానీ రెవెన్యూ అధికారుల నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలోనే ఆదిత్య బిల్డర్స్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయడం జరిగింది.. ఈ నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించిందన్నారు. ఆదిత్య బిల్డర్స్ ఈ రద్దుపై హైకోర్టును ఆశ్రయించి, తాము బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టడం లేదని వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలను కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నివేదికలపై హైకోర్టు నిర్మాణ అనుమతులను పునరుద్ధరించింది. ఆ ప్రకారమే ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
కవిత ఆరోపణలపై ఖండన
హైకోర్టు అనుమతులు ఇచ్చినా, అదనపు జాగ్రత్తగా మరోసారి నిర్ధారించుకోవాలనే ఉద్దేశంతోనే తాము తహశీల్దార్‌కు లేఖ రాశామని, దీనిని తప్పుగా చిత్రించడం సరికాదని హైడ్రా పేర్కొంది. గతంలోనే ఈ విషయమై వివరణ ఇచ్చినప్పటికీ, మాజీ ఎమ్మెల్సీ కవిత మళ్ళీ అదే ఆరోపణలు చేయడాన్ని హైడ్రా తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని కవితకు విజ్ఞప్తి చేసింది. నదీ గర్భంలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారన్న అనుమానం ఉండబట్టే తాము రెవెన్యూ శాఖను సంప్రదించామని, ఇందులో హైడ్రా వైఫల్యం ఏమీ లేదని పేర్కొంది.
