
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బ్యారక్‌లో స్మార్ట్‌ఫోన్ స్వాధీనం
అత్యాచారం కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బ్యారక్‌లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లభించడంతో కలకలం రేగింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో మంగళవారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నిర్వహించిన తనిఖీల్లో ఈ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ బుధవారం వెల్లడించారు.హై సెక్యూరిటీ జైలులో ఉన్న ప్రముఖ ఖైదీలు, ఇతర ఖైదీల బ్యారక్‌లలో సుమారు నాలుగు నుంచి ఐదు గంటలపాటు సీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజ్వల్ రేవణ్ణ బ్యారక్‌లో ఆండ్రాయిడ్ ఫోన్ లభించింది.ఈ ఘటనపై సీసీబీ అధికారులు పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అంతకుముందు ఆగస్టు 6న జైలు అధికారులు రేవణ్ణ బ్యారక్‌లో తనిఖీలు నిర్వహించినప్పటికీ, అప్పుడు ఎలాంటి నిషేధిత వస్తువులు లభించలేదని డీజీపీ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించడంతో డీఐజీ (దక్షిణ) నివేదిక ఆధారంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగాపూర్‌ను సస్పెండ్ చేశారు. బెంగళూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని అలోక్ కుమార్ వెల్లడించారు.
మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత హెచ్.డీ. రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్ రేవణ్ణ 2019 నుంచి 2024 వరకు హాసన్ లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. లైంగిక దాడి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో 2024 మేలో ఆయన అరెస్టయ్యారు. అనంతరం అత్యాచారం కేసులో దోషిగా తేలారు. 2025 ఆగస్టులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించడంతో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.
లోపాల కారణంగానే ఆకస్మిక తనిఖీలు: మంత్రి ప్రియాంక్ ఖర్గే
పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో తాను ఇటీవల పర్యటించిన సమయంలో పరిపాలనా లోపాలను గుర్తించడంతోనే ఆకస్మిక తనిఖీలకు ఆదేశించినట్లు కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జైళ్లలోనూ ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అనుమతితో సుమారు 100 మంది సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిబ్బందిని తనిఖీల కోసం పంపినట్లు ఖర్గే తెలిపారు. ఈ తనిఖీల్లో అనేక లోపాలు బయటపడ్డాయని చెప్పారు. తనిఖీలు పరప్పన అగ్రహార జైలుకే పరిమితం కావని ఖర్గే స్పష్టం చేశారు. కలబురగి, బెళగావి, బెంగళూరు సహా రాష్ట్రంలోని ఏ జైలులోనైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
నిషేధిత వస్తువులు జైలులోకి ఎలా వచ్చాయి?
దర్యాప్తును తొందరపెట్టకుండా.. నిషేధిత వస్తువులు జైలులోకి ఎవరు తీసుకొచ్చారు? ఖైదీలకు ఎవరు సహకరించారు? ఏ విధంగా సహకరించారు? అనే అంశాలను గుర్తించాల్సి ఉందని ఖర్గే తెలిపారు. జైళ్లలోని డిజిటల్ మౌలిక వసతులు, ముఖ్యంగా మొబైల్ ఫోన్ జామర్లపై సాంకేతిక ఆడిట్ నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు. జైళ్లలో జామర్లు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అవి పనిచేయడం లేదన్న సమాచారం తమకు అందుతోందని చెప్పారు. అందువల్ల రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న డిజిటల్ మౌలిక వసతులన్నింటినీ పూర్తిగా తనిఖీ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
గతంలోనూ పలుమార్లు ఫోన్లు స్వాధీనం
పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో మొబైల్ ఫోన్లు బయటపడటం ఇదే తొలిసారి కాదు. 2026 ఏప్రిల్ 10న జైలు అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆరు మొబైల్ ఫోన్లు, ఒక సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఏడాది నిర్వహించిన మరో తనిఖీలో ఆరు ఫోన్లు, ఎనిమిది సిమ్ కార్డులు, ఇయర్‌బడ్స్, ఇయర్‌ఫోన్లు, చార్జింగ్ కేబుల్, అడాప్టర్ తదితర నిషేధిత వస్తువులు లభించాయి. ఈ ఘటనలపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాదు, మార్చిలోనూ జైలు ఖైదీలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్న వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఫోన్లను టాయిలెట్ సమీపంలోని భూగర్భ పైపుల ప్రాంతంలో దాచినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలగా, ముగ్గురు వార్డర్లను సస్పెండ్ చేశారు.
