
మాచర్ల అత్యాచార ఘటన… నిందితుడిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. పంచాయతీరాజ్ శాఖలో అవుట్‌సోర్సింగ్ సిబ్బందిగా (ఆఫీస్ సబార్డినేట్) విధులు నిర్వహిస్తున్న 32 ఏళ్ల మహిళపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. నిందితుడిని తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని, బాధితురాలికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
దాహం పేరుతో వచ్చి ఘాతుకానికి ఒడిగట్టి
పోలీసుల కథనం ప్రకారం బాధితురాలు తన భర్తతో విడిపోయి మాచర్లలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె కుమార్తె తాతయ్య, అమ్మమ్మల వద్ద ఉంటోంది. ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తలుపు తట్టాడు. తాగడానికి మంచినీళ్లు కావాలని అడగడంతో మానవత్వంతో ఆమె తలుపు తీసింది. అదే సమయంలో నిందితుడు ఒక్కసారిగా లోపలికి చొరబడి ఆమెపై భౌతిక దాడికి దిగాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. బాధితురాలిని మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా కేసు దర్యాప్తు కోసం అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని త్వరలోనే అసలైన నిందితుడిని పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
ఉపేక్షించే ప్రసక్తే లేదు: సీఎం చంద్రబాబు
ఈ అమానుష ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మహిళలపై జరిగే నేరాలను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన స్పష్టం చేశారు. "రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ఇలాంటి పైశాచిక చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూడాలి అని సీఎం పోలీసులను ఆదేశించారు. నిందితుడి వేటలో ఎటువంటి జాప్యం జరగకూడదని కేసు పురోగతిని ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులకు సూచించారు.
