Let's talk: editor@tmv.in
మాకు ఎవరి అవసరం లేదు.. మిత్ర దేశాలపై ట్రంప్ ఆగ్రహం

మాకు ఎవరి అవసరం లేదు.. మిత్ర దేశాలపై ట్రంప్ ఆగ్రహం

Shaik Mohammad Shaffee
18 మార్చి, 2026

హోర్ముజ్ జలసంధి రక్షణ కోసం ఏర్పాటు చేసిన కూటమిలో చేరడానికి వెనుకాడుతున్న మిత్రదేశాల తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది.. మాకు ఎవరి అవసరమూ లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. వైట్ హౌస్ వేదికగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఈ సంక్షోభంపై మరింత ఉత్సాహంగా స్పందించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. నాటో అంటేనే అమెరికా అని, దశాబ్దాలుగా తామే ఐరోపాను రక్షిస్తున్నామని గుర్తు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అమెరికా బలగాలను చూసే భయపడతారని, ఐరోపా దేశాలంటే ఆయనకు లెక్కలేదని ట్రంప్ ఎద్దేవా చేశారు.

ఇరాన్‌పై భీకర దాడులు

ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఇప్పటివరకు ఇరాన్ వ్యాప్తంగా 7,000 సైనిక, వాణిజ్య లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఖర్గ్ ద్వీపంపై దాడులు చేసి, భవిష్యత్తు పునర్నిర్మాణం కోసం కేవలం పైపులైన్లను మాత్రమే వదిలి మిగిలిన మౌలిక సదుపాయాలన్నీ తుడిచిపెట్టామని చెప్పారు. ఈ దాడుల వల్ల ఇరాన్ క్షిపణి ప్రయోగాలు 90 శాతం, డ్రోన్ దాడులు 95 శాతం తగ్గాయని వివరించారు. ఇరాన్ వాయుసేన, నౌకాదళం, రాడార్ వ్యవస్థలు పూర్తిగా పతనమయ్యాయని, గత 47 ఏళ్ల భీభత్సానికి తాము చరమగీతం పాడుతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చైనా పర్యటన వాయిదా

ప్రస్తుత యుద్ధ పరిస్థితుల దృష్ట్యా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగాల్సిన భేటీ వాయిదా పడే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. ట్రంప్ ప్రస్తుతం కమాండర్ ఇన్ చీఫ్‌గా ఈ సైనిక ఆపరేషన్‌ విజయవంతం చేయడంపైనే దృష్టి సారించారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడి, ప్రాక్సీల ద్వారా సాగిస్తున్న దాడులను ఆపాలని హెచ్చరించారు. అయితే మిత్రదేశాలు స్పందించే తీరుపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారని, వారు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నారని లెవిట్ స్పష్టం చేశారు.

మాకు ఎవరి అవసరం లేదు.. మిత్ర దేశాలపై ట్రంప్ ఆగ్రహం - Tholi Paluku