
మహిళ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం
మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుందని పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్ తెలిపారు. సోమవారం ఉదయం ఎన్.టి.ఆర్. ఆసుపత్రి, అనకాపల్లి ఎదురుగా ఉన్న డి.ఎ.సి. ఆవరణములో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఆరోగ్య సేవలను ఆయన ప్రారంభించారు.
కార్యక్రమం ప్రారంబోత్సవం అనంతరం పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలిపారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు రెండు వారాల పాటు స్వస్త్ నారి సశక్త్ అభియాన్( ఆరోగ్య వంత మైన మహిళ- శక్తి వంత మైన కుటుంబం) అను సమగ్ర ఆరోగ్య ప్రచార్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబం బలపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమం ద్వారా జిల్లా లోని అన్ని గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో 123 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యసహాయం అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ ఆరోగ్యం పై అవగాహన పెంచడం, మహిళలకు సమయానుకూల వైద్య సేవలు అందించడం, పోషకాహారాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా మహిళ ఆరోగ్యం బలపడితే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని, తల్లి ఆరోగ్యంగా ఉంటే తన పిల్లలు ఆరోగ్యం గా పెరుగుతారని, తద్వారా మహిళా శక్తి సమాజ శక్తికి పునాది అవుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు వారి ఆరోగ్య వివరాలను అబా యాప్ లో నమోదు చేసుకోవాలని, తద్వారా దేశంలో ఎక్కడ వైద్యం చేయించుకున్నా రోగి వివరాలు అందుబాటులో ఉండి సత్వరమే మెరుగైన వైద్యసదుపాయం అందించుటకు వీలుకలుగుతుందన్నారు. ప్రజలకు తక్కువ ధరకు ఔషదాలను అందించుటకు జి.ఎస్.టి. సంస్కరణలలో భాగంగా నిత్యావసరమైన మందులపై జీరో పర్శంట్ టాక్స్ విధానాన్ని అమలు చేస్తుండగా, మిగిలిన మందులను 5శాతం, 12 శాతం స్లాబులకు తగ్గంచడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ పైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కార్పొరేషను చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఎ.పి.గవర సంక్షేమ మరియు అభివృద్ది కార్పొరేషను చైర్మన్ మల్ల సురేంద్ర, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా. ఎం.హైమావతి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. శ్రీనివాస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కృష్ణారావు, డిఐఒ డా. చంద్రశేఖర్ దేవ్, ఎపిఎంఒ డా.జె. ప్రశాంతి, కూటమినాయకులు తదతరులు పాల్గొన్నారు.
