
మహిళా సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాది: మంత్రి సీతక్క
రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, రక్షణ, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల సమగ్ర సంక్షేమం సాధించాలంటే సంబంధిత శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, లింగ వివక్ష నిర్మూలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ నుంచే లింగ సమానత్వ భావనను పెంపొందించేలా పాఠ్యాంశాల్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరాన్ని చర్చించారు. అలాగే ఉద్యోగ రంగంలో మహిళలకు సమాన హక్కులు, ప్రైవేటు రంగంలోనూ మెటర్నిటీ బెనిఫిట్ చట్టం సమర్థవంతంగా అమలవ్వాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
మహిళా భద్రత అంశంపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలతో పాటు పోలీస్ శాఖ సమన్వయంతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మహిళలకు భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో వచ్చిన సూచనలను అమలు చేయడానికి అంశాల వారీగా సబ్ కమిటీలు ఏర్పాటు చేసి, తక్షణమే కార్యాచరణ బృందాలను నియమించాలని మంత్రి ఆదేశించారు. మహిళల సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాది. వారికి భద్రత, సమాన అవకాశాలు, ఆరోగ్యం, గౌరవప్రద జీవనం కల్పించడం ప్రభుత్వ ధర్మం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
