
మహిళా సాధికారతలో భారత్ కొత్త అధ్యాయం రాస్తోంది: ప్రధాని మోడీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్ మహిళా సాధికారతలో కొత్త అధ్యాయం రాస్తోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. జాతీయ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగిన ప్రజా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మహిళలు వివిధ రంగాల్లో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమం మరో కారణంతో కూడా ప్రత్యేకం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. భారత్ మహిళా సాధికారతలో కొత్త అధ్యాయం రాస్తోంది. రేఖా గుప్తా విజయవంతమైన నాయకత్వంలో ఢిల్లీలో బలమైన, శక్తివంతమైన అభివృద్ధి కనిపిస్తోందని మోడీ తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ అభివృద్ధిలో వారి గొప్ప పాత్రకు తాను వందనం చేస్తున్నానని ప్రధాని చెప్పారు. సమాజాన్ని మరింత బలపరుస్తూ దేశాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు మహిళలు ఇదే ఉత్సాహంతో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఢిల్లీ రాజకీయ పరిణామాలపై కూడా ప్రధాని ప్రస్తావిస్తూ, సుమారు ఏడాది క్రితం ఢిల్లీ ప్రజలు బీజేపీకి ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇచ్చారని అన్నారు. ఆ నిర్ణయ ఫలితంగా ఇప్పుడు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన కూడా చేశారు. కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కారించారు. అంతకుముందు ప్రధాని మోడీ ఢిల్లీలోని సరోజినీ నగర్ ప్రాంతంలో ఉన్న జీపీఆర్‌ఏ టైప్–5 క్వార్టర్స్‌ను సందర్శించి మహిళా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేశారు. అక్కడ నివాసం పొందిన మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.
పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పాతబడి పోయిన ప్రభుత్వ కాలనీలను పునర్వికాసం చేయడానికి ఒక వినూత్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ద్వారా ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు అవసరం లేకుండా రూపొందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం సుమారు 537 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏడు ప్రభుత్వ కాలనీలు అభివృద్ధి చేయనున్నారు. వాటిలో సరోజిని నగర్, నేతాజీ నగర్, నౌరోజీ నగర్, కస్తుర్భా నగర్, త్యాగరాజ్ నగర్, శ్రీనివాసపురి, ముహమ్మదాపూర్ కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీల్లో ఉన్న పాత క్వార్టర్స్‌లో చాలా వాటి పరిస్థితి దెబ్బతింది. సుమారు 40 శాతం ఇళ్లు నివాసానికి పనికిరాకుండా ఉన్నాయి. అందుకే పాత లో-రైజ్ భవనాలను కూల్చి, ఆధునిక హై-రైజ్ రెసిడెన్షియల్ కాంప్లెక్సులు నిర్మించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 21,000కుపైగా కొత్త నివాస యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు మెరుగైన మౌలిక వసతులు, ప్రజా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అధికారుల ప్రకారం ఈ ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఆధారంగా అమలు అవుతోంది. మొత్తం ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు 69.41 ఎకరాలు (దాదాపు 12.9%) వాణిజ్య, నివాస అవసరాలకు మోనిటైజ్ చేయనున్నారు.
రాష్ట్రపతి ముర్ముపై టీఎంసీ ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది
పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల అక్కడి ప్రభుత్వం తీవ్రంగా అవమానించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. రాష్ట్రపతి ముర్ము సంతాల్ ఆదివాసీ సంప్రదాయాన్ని గౌరవించే ఒక ముఖ్య కార్యక్రమానికి హాజరుకావడానికి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లారని ప్రధాని తెలిపారు. ముర్ము స్వయంగా ఆదివాసీ వర్గానికి చెందినవారే కావడంతో ఆ కార్యక్రమం ఆమెకు, అలాగే ఆదివాసీ సమాజానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిందని చెప్పారు. ఈ చర్య వల్ల కార్యక్రమ నిర్వహణలో లోపాలు తలెత్తడమే కాకుండా, అది రాష్ట్రపతి పదవికి, రాజ్యాంగానికి, దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అవమానంగా మారిందని ఆయన విమర్శించారు.
ఇక మహిళా సాధికారతపై కూడా ప్రధాని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమం ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని తెలిపారు. దేశంలో మూడు కోట్ల మహిళలను లఖ్‌పతి దీదీలుగా తయారు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పూర్తిచేసిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మూడు కోట్ల మహిళలను లఖ్‌పతి దీదీలుగా మార్చాలని మేము సంకల్పించాం. అప్పట్లో చాలామంది దీనిపై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మూడు కోట్లకు పైగా మహిళలు ఈ లక్ష్యాన్ని చేరుకున్నారని ప్రధాని తెలిపారు.
