Let's talk: editor@tmv.in
మహిళా సంఘాలకు మరో 448 అద్దె బస్సుల కేటాయింపు: మంత్రి పొన్నం

మహిళా సంఘాలకు మరో 448 అద్దె బస్సుల కేటాయింపు: మంత్రి పొన్నం

Gaddamidi Naveen
2 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థిక బలోపేతానికి దోహదం చేసే చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్టీసీ అద్దె బస్సులు విజయవంతమై, మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం మరింత విస్తృతతరమైన చర్యలు చేపట్టింది. సహచర మంత్రి సీతక్కతో కలిసి ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌క‌టించారు.

600కు పెరగనున్న బస్సుల సంఖ్య

ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలోని మండల మహిళా సమాఖ్యలు మొత్తం 152 ఆర్టీసీ అద్దె బస్సులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని.ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మరో 448 అద్దె బస్సులను మహిళా స్వయం సహాయక సంఘాలకే కేటాయించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ బస్సుల కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి పంపిన లేఖలో పేర్కొన్నారు అని మంత్రి తెలిపారు. అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే ఈ బస్సులను ఆర్టీసీకి అప్పగించనున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు.

ఇందిరా మహిళా శక్తి పథకం లక్ష్యం

ఈ చర్యతో త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ అద్దె బస్సులలో మహిళా సంఘాల వాటా గణనీయంగా పెరగనుందన్నారు. ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమ‌ని. ఒక్కో బస్సు ద్వారా మహిళా సంఘాలకు నెలకు సుమారు రూ.70,000 వరకు అద్దె ఆదాయం లభించడం గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు భారీ దోహదం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.గ్రామీణ మహిళలు తమదైన శ్రమ, నిబద్ధత, క్రమశిక్షణతో ఈ బస్సులను నిర్వహించడం రాష్ట్ర ప్ర‌జా రవాణా వ్యవస్థకు ఓ కొత్త దిశను చూపుతోందన్నారు.మహిళలు కేవలం ప్రయోజనభారులుగా కాకుండా, ప్రజా రవాణాలో ప్రత్యక్ష భాగస్వాములుగా మారడం సామాజికంగా కూడా ఒక పెద్ద మార్పుకు నాంది కానుందని మంత్రి అన్నారు.

ప్రభుత్వం భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తరించి, ఇంకా ఎక్కువ సంఖ్యలో మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా బలపడటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా పటిష్టం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.మొత్తం మీద, మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలను అప్పగించడం ద్వారా మహిళలలో స్వయం సమృద్ధి, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుండటం రాష్ట్ర అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తోందని మంత్రి పొన్నం అన్నారు.