Let's talk: editor@tmv.in
మహిళా సంక్షేమం కోసం మెన్‌స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్లు 2024 ప్రవేశపెట్టిన ఎంపీ కావ్య

మహిళా సంక్షేమం కోసం మెన్‌స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్లు 2024 ప్రవేశపెట్టిన ఎంపీ కావ్య

Gaddamidi Naveen
7 డిసెంబర్, 2025

లోక్‌సభలో మహిళల ఆరోగ్యం, శ్రమ హక్కుల పరిరక్షణ దిశగా మరో కీలక అడుగు పడింది. మహిళా ఉద్యోగులు రుతుస్రావ సమయంలో ఎదుర్కొనే శారీరక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వరంగల్ లోక్‌సభ ఎంపీ కడియం కావ్య చారిత్రాత్మకమైన మెన్‌స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్లు, 2025ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లు ద్వారా మహిళలకు వేతనంతో కూడిన రుతుస్రావ సెలవు కల్పించాలని ప్రతిపాదించారు.

ఈ బిల్లులో భాగంగా, మహిళలకు నెలకు నాలుగు రోజుల చెల్లింపు మెన్‌స్ట్రువల్ లీవ్, అవసరమైనప్పుడల్లా విశ్రాంతి విరామాలు, అలాగే పెద్ద పరిశ్రమలు, సంస్థల్లో అనివార్య క్రెచ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అమలు చేయని యజమాన్యాలపై కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలని కూడా బిల్లులో ఉంది. ఈ బిల్లులో ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఉద్యోగినులకు మాత్రమే కాకుండా విస్తృత వర్గాల మహిళలకు,పాఠశాల విద్యార్ధినులకు కూడా వర్తించేటట్లు రూపొందించబడింది. ఇందులో ముఖ్యంగా ,

• ఏడో తరగతి నుంచి పై తరగతుల విద్యార్థినులు,

• స్వయం ఉపాధి చేసుకునే మహిళలు,

అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళలు అందరికీ ఈ ప్రయోజనాలు అందేలా నిబంధనలు ప్రతిపాదించబడ్డాయి. మహిళల శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడం, చదువు, ఉద్యోగాల్లో సమాన అవకాశాలను కల్పించడం, పనిస్థలాల్లో గౌరవప్రదమైన వాతావరణాన్ని నిర్ధారించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.

ఇదిలా ఉండగా, మెన్‌స్ట్రువల్ లీవ్‌పై రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి భిన్నంగా కనిపిస్తోంది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించి మెన్‌స్ట్రువల్ లీవ్‌ను అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. ‘మహిళల ఆరోగ్యం, వారి పనితీరు, చదువుపై నెలసరి ప్రభావాన్ని గుర్తించి నిర్ణయం తీసుకుంటాం’ అని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు మాత్రమే ఇస్తున్నాయి. కడియం కావ్య ప్రవేశపెట్టిన ఈ బిల్లు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది. మహిళల శ్రమ హక్కులు, జీవన నాణ్యత పెంపు దిశగా ఇది ఒక మైలురాయిగా మారుతుందా అన్నదానిపై దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మహిళా సంక్షేమం కోసం మెన్‌స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్లు 2024 ప్రవేశపెట్టిన ఎంపీ కావ్య - Tholi Paluku