Let's talk: editor@tmv.in
మహిళా శక్తిని బలోపేతం చేయాలి: ప్రధాని మోడీ

మహిళా శక్తిని బలోపేతం చేయాలి: ప్రధాని మోడీ

Pinjari Chand
10 ఏప్రిల్, 2026

దేశంలోని మహిళా శక్తిని బలోపేతం చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ చట్టానికి ప్రతిపాదిస్తున్న సవరణలు కేవలం చట్టపరమైన చర్య మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మహిళల ఆశయాలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించిన వ్యాసంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు అభివృద్ధి చెందాలని భారతీయ నాగరికత ఎంతోకాలంగా నమ్ముతుందని ఆయన తెలిపారు. మహిళలకు శాసనసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ‘నారి శక్తి వందన్ అధినియమ్’ (ఉమెన్‌ రిజర్వేషన్‌ యాక్ట్‌) అమలుకు సంబంధించి కీలకమైన బిల్లు ఏప్రిల్‌ 16న పార్లమెంట్‌లో చర్చకు రానుందని తెలిపారు. దీనిపై చర్చించి ఆమోదించేందుకు ఏప్రిల్‌ 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సవరణల ద్వారా 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమలులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోడీ తెలిపారు. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉండగా, ప్రతిపాదిత మార్పుల ప్రకారం వాటిని 816 స్థానాలకు పెంచనున్నారు. వీటిలో 273 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయనున్నారు.

అలాగే షెడ్యూల్డ్‌ క్యాస్ట్(ఎస్సీ), షెడ్యూల్డ్‌ ట్రైబల్స్‌ (ఎస్టీ)కు కేటాయించే రిజర్వేషన్‌లో కూడా మహిళలకు ప్రత్యేకంగా భాగం ఉండేలా ‘వర్టికల్ రిజర్వేషన్’ విధానం అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే 2023లో రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం తీసుకొచ్చినప్పటికీ, అది 2027 జనగణన తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) పూర్తయ్యాకే అమలులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం అది 2034 తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతిపాదిత సవరణలతో 2011 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేసి 2029 నుంచే అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

రాజకీయాల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం లేదు

రాష్ట్ర శాసనసభల్లో కూడా ఇదే విధంగా స్థానాల పెంపు చేసి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశ జనాభాలో సగం మంది మహిళలేనని, వారి కృషి దేశ అభివృద్ధిలో కీలకమని ప్రధాని పేర్కొన్నారు. విజ్ఞానం, సాంకేతికత, వ్యాపార రంగం, క్రీడలు, రక్షణ దళాలు, కళలు వంటి అన్ని రంగాల్లో మహిళలు గొప్ప విజయాలు సాధిస్తున్నారని ఆయన అన్నారు. మహిళల సాధికారత కోసం విద్య, ఆరోగ్యం, ఆర్థికాంశాలు , ప్రాథమిక సౌకర్యాల ప్రాప్తి వంటి అంశాల్లో గత కొన్ని సంవత్సరాల్లో పెద్దఎత్తున చర్యలు తీసుకున్నామని మోడీ చెప్పారు. అయితే రాజకీయాలు, శాసనసభల్లో వారి ప్రాతినిధ్యం మాత్రం సమాజంలో ఉన్న పాత్రకు తగిన స్థాయిలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పాలన, నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే ప్రజాస్వామ్య చర్చ మరింత సమృద్ధిగా మారుతుందని, పరిపాలన నాణ్యత కూడా మెరుగవుతుందని ఆయన పేర్కొన్నారు.

అన్ని పార్టీలు మద్దతివ్వాలి

మహిళలకు రాజకీయ వ్యవస్థలో తగిన స్థానం కల్పించాలనే ప్రయత్నాలు గతంలో అనేకసార్లు జరిగినప్పటికీ, అవి అమలులోకి రాలేదని ప్రధాని గుర్తుచేశారు. అయితే 2023లో పార్లమెంట్‌లో అన్ని పార్టీల సమ్మతితో ‘నారి శక్తి వందన్ అధినియమ్’ ఆమోదం పొందడం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన సందర్భాలలో ఒకటని ఆయన చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు సమానత్వం ఆధారంగా సమాజం నిర్మించాలని కలలు కన్నారని, మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం ఆ లక్ష్యాన్ని సాధించే కీలక అడుగుగా తెలిపారు. మహిళల ప్రాతినిధ్యం పెరగడం ఆలస్యం అవుతుంటే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే అవుతుందని ఆయన అన్నారు. అందుకే ఈ చారిత్రాత్మక నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు మద్దతు ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పుడూ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి ఏకమై ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. అదే ఆత్మతో మహిళా శక్తిని బలోపేతం చేసి దేశ అభివృద్ధికి దోహదపడదామని ప్రధాని పిలుపునిచ్చారు.