Let's talk: editor@tmv.in
మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సరస్ మేళా: ఎమ్మెల్యే మాధవి

మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సరస్ మేళా: ఎమ్మెల్యే మాధవి

Panthagani Anusha
14 జనవరి, 2026

గుంటూరు రెడ్డి కాలేజీ ఎదురు ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్ మేళాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. మేళాలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన 307 స్టాల్స్‌ను పరిశీలించి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి మహిళా వ్యాపార వేత్తలను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వ్యాపార వేత్తలుగా ఎదుగుతున్న తీరును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేళాను సందర్శించినట్లు తెలిపారు.ఇంతకు ముందు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇలాంటి మేళాల్లో పాల్గొనాల్సి వచ్చేదని ఇప్పుడు అదే అవకాశం గుంటూరులో లభించడం మహిళలకు గొప్ప వరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొందరు మహిళలు కృతజ్ఞతతో ఆనంద భాష్పాలు పెట్టిన దృశ్యాలు హృదయాన్ని తాకాయని తెలిపారు.

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సందర్శకుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. సాధారణంగా ప్రతి జిల్లాలో చిన్న స్థాయిలో జరిగే సరస్ మేళాను, ఈసారి దాదాపు రూ.3 కోట్ల నిధులతో దేశ నలుమూలల నుంచి మహిళలు పాల్గొనేలా ఘనంగా నిర్వహించారని తెలిపారు. ఈ మేళా గుంటూరు నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. సరస్ మేళా 18వ తేదీ వరకు కొనసాగుతుందని, సంక్రాంతి పండగకు గుంటూరుకు వచ్చే ప్రజలు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సంబరాలతో పాటు ఈ మేళాను కూడా సందర్శించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రతి ఏడాది కనిపించే వాతావరణాన్ని ఈసారి గుంటూరులో చూడటం ఆనందంగా ఉందని ఇది ‘మినీ ఇండియాను తలపించేలా ఉంది ఇలాంటి మేళాలు నిరంతరం కొనసాగాలని, మహిళలను మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే మాధవి పేర్కొన్నారు.

మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సరస్ మేళా: ఎమ్మెల్యే మాధవి - Tholi Paluku