Let's talk: editor@tmv.in
మహిళా లోకానికి రక్షా కవచం: 'షీ-బాక్స్' ఒక విశ్లేషణ

మహిళా లోకానికి రక్షా కవచం: 'షీ-బాక్స్' ఒక విశ్లేషణ

Dantu Vijaya Lakshmi Prasanna
16 ఫిబ్రవరి, 2026

నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అంతరిక్షం నుండి యుద్ధ విమానాల వరకు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నప్పటికీ, పురుషాధిక్య సమాజం యొక్క ఆలోచనా ధోరణిలో ఆశించిన మార్పు రాలేదనేది పచ్చి నిజం. ఒకే పనిని పురుషుడితో సమానంగా, ఒక్కోసారి అంతకంటే మెరుగ్గా చేసినా, వేతనాల విషయంలో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా అభిప్రాయాన్ని పంచుకునేటప్పుడు "నీకేం తెలుసులే" అనే చులకన భావం, ఆమె మేధస్సును తక్కువ చేసి చూపే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.

ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా ఒక మహిళా అభిప్రాయానికి దక్కాల్సిన కనీస విలువ దక్కకపోవడం, ఆమెను కేవలం ఒక భావోద్వేగ జీవిగానే చూడటం వంటివి ఆమె ఎదుగుదలకు అడ్డుగోడలుగా మారుతున్నాయి. ఈ అదృశ్య వివక్ష వల్ల మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి ప్రతిరోజూ ఒక యుద్ధమే చేయాల్సి వస్తోంది.ఒకవేళ వీటన్నిటిని గెలిచి బయటకు అడుగుపెట్టినా, మళ్లీ తిరిగి ఇంటికి చేరుకునేదాకా ఆమె భద్రత నేటి రోజుల్లో ఒక ప్రశ్నార్ధకమే

ఒక ఆడపిల్ల చదువుకుని, ఎన్నో కలలతో ఇంటి గడప దాటి బయటకు వస్తున్నప్పుడు, ఆ తల్లిదండ్రుల కళ్లలో గర్వంతో పాటు ఒక తెలియని భయం కూడా ఉంటుంది. "నా బిడ్డ వెళ్లే చోటు సురక్షితమేనా? అక్కడ ఆమెకు తగిన గౌరవం దక్కుతుందా?" అన్న ప్రశ్న ప్రతి ఇంట్లోనూ వినిపిస్తుంది. నేటి ఆధునిక యుగంలో మహిళలు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నా, కార్యాలయాల్లో వేధింపులు అనే చీకటి నీడలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. కష్టపడి పనిచేసే చోట కన్నీళ్లు రాకూడదని, ప్రతి మహిళా తన ప్రతిభను చాటుకునే స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని ఆకాంక్షిస్తూ తెచ్చిన అద్భుత రక్షణ కవచమే 'షీ-బాక్స్' . ఇది కేవలం ఒక పోర్టల్ కాదు, కోట్లాది మంది శ్రామిక మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక.

జాతీయ సదస్సు - ఒక చారిత్రక మైలురాయి

2026, ఫిబ్రవరి 14న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సు, దేశంలోని మహిళా భద్రతా వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. "కార్యాలయాల్లో మహిళల భద్రత" అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదు, వాటిని సాంకేతికతతో జోడించి ప్రతి మహిళకు చేరువ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.

షీ - బాక్స్ సరికొత్త హంగులు

మహిళలు కార్యాలయాల్లో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక డిజిటల్ వేదిక ఉండాలనే లక్ష్యంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017 జూలై 24న షీ-బాక్స్ పోర్టల్‌ను తొలిసారిగా ప్రారంభించింది. ప్రారంభంలో ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, ప్రైవేట్ రంగంలో కూడా ఇలాంటి వేధింపులు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి, 2017 నవంబర్ 7 నుండి దీనిని దేశంలోని ప్రైవేట్ రంగ మహిళా ఉద్యోగులందరికీ విస్తరించారు.

షీ -బాక్స్ ఒక కేంద్ర ప్రభుత్వ పోర్టల్ అయినప్పటికీ, ఇది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సమర్థవంతంగా అమలు అవుతోంది. ఇది ఒక గొడుగు లాంటి వ్యవస్థగా పనిచేస్తుంది. ఒక మహిళ ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ రంగంలో పనిచేస్తున్నా (ప్రభుత్వ, ప్రైవేట్ లేదా అసంఘటిత రంగం) ఈ పోర్టల్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మీరు చేసే ఫిర్యాదు నేరుగా ఆయా సంస్థలోని 'అంతర్గత కమిటీ'కి లేదా ఆ జిల్లాలోని 'లోకల్ కమిటీ'కి పంపబడుతుంది. దీనివల్ల రాష్ట్రాల సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రతి మహిళా తన రక్షణ కోసం ఈ వ్యవస్థను వాడుకోవచ్చు.

బాధ్యతాయుతమైన పర్యవేక్షణ

ఈ వ్యవస్థ కేవలం ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, వాటి పరిష్కార ప్రక్రియను కూడా పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదు అందిన తర్వాత సంబంధిత అధికారులు దానిపై తీసుకున్న చర్యలను పోర్టల్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల "నీకేం తెలియదు" అని మహిళల అభిప్రాయాన్ని తక్కువ చేసే పాతకాలపు ధోరణులకు చెక్ పడుతుంది. ప్రతి ఫిర్యాదుకు ఒక ప్రత్యేక ఐడి ఉండటం వల్ల, బాధితులు తమ కేసు ఏ దశలో ఉందో ట్రాక్ చేసుకోవచ్చు. ఫలితంగా, కార్యాలయాల్లో మహిళల పట్ల వివక్ష చూపేవారికి లేదా వేధింపులకు పాల్పడేవారికి ఈ వ్యవస్థ ఒక గట్టి హెచ్చరికగా పనిచేస్తుంది.

షీ-బాక్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు అందినప్పుడు, చట్టపరమైన పరిపాలనాపరమైన చర్యలు చాలా పకడ్బందీగా జరుగుతాయి. ఫిర్యాదు అందిన వెంటనే, ఆ సమాచారం సంబంధిత సంస్థలోని 'అంతర్గత కమిటీ' కి లేదా జిల్లా స్థాయి 'లోకల్ కమిటీ'కి చేరుతుంది. ఈ కమిటీలకు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి, అంటే వారు సాక్షులను పిలిపించవచ్చు. ఆధారాలను సేకరించవచ్చు. విచారణలో నేరం రుజువైతే, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా జీతంలో కోత విధించడం, పదోన్నతి నిలిపివేయడం, లేదా తక్షణమే ఉద్యోగం నుండి తొలగించడం వంటి చర్యలు ఉంటాయి. తీవ్రమైన నేరాల విషయంలో బాధితురాలికి అండగా ఉంటూ పోలీసుల ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసే బాధ్యతను కూడా ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి.

మరోవైపు, ఈ వ్యవస్థ బాధితురాలికి మానసిక, వృత్తిపరమైన రక్షణను కల్పిస్తుంది. విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలు నిందితుడిని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా, ఆమెను లేదా నిందితుడిని వేరే విభాగానికి బదిలీ చేసే అధికారం కమిటీకి ఉంటుంది. అలాగే, అవసరమైతే బాధితురాలికి మూడు నెలల వరకు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవును కూడా మంజూరు చేస్తారు. షీ -బాక్స్ పోర్టల్ ద్వారా ఈ మొత్తం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షిస్తుంది కాబట్టి, సంస్థలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అవకాశం ఉండదు. ప్రతి అడుగులోనూ పారదర్శకత ఉంటుంది, దీనివల్ల ఫిర్యాదు చేసిన మహిళకు తగిన న్యాయం జరుగుతుందనే భరోసా లభిస్తుంది.

అప్పటి నుండి ఈ పోర్టల్ నిరంతరం మార్పులకు లోనవుతూ, తాజాగా ఫిబ్రవరి 14, 2026న 'మిషన్ శక్తి' యాప్‌తో అనుసంధానమై మరింత శక్తివంతంగా మారింది.

ఈ సదస్సులో షీ - బాక్స్ పోర్టల్‌కు సంబంధించి కొత్త లోగోను, అత్యాధునిక ఫీచర్లను ఆవిష్కరించారు. ఈ పోర్టల్ ఇప్పుడు మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదులను నమోదు చేయడం, వాటి పురోగతిని ట్రాక్ చేయడం ఇప్పుడు మరింత సులభతరం చేయబడింది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతూనే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

మిషన్ శక్తి , కర్మయోగి భారత్ అనుసంధానం

ప్రభుత్వం కేవలం ఒక పోర్టల్‌కే పరిమితం కాకుండా, దీన్ని 'మిషన్ శక్తి' యాప్‌తో అనుసంధానించింది. దీనివల్ల మహిళలు తమ మొబైల్ నుండే నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కలిగింది. అలాగే, 'కర్మయోగి భారత్' ప్లాట్‌ఫారమ్ ద్వారా పాష్ శిక్షణను అనుసంధానించడం ద్వారా, ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు వేధింపుల పట్ల అవగాహన కల్పించడం, అటువంటి ఘటనలు జరగకుండా నిరోధించడంపై దృష్టి సారించారు.

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల(PoSH)వాలంటరీ కాంప్లయన్స్ చెక్‌లిస్ట్

కార్యాలయాల్లో భద్రత అనేది కేవలం ఉద్యోగి బాధ్యత కాదు, ఆ సంస్థ బాధ్యత కూడా. అందుకే 'పోష్ వాలంటరీ కాంప్లయన్స్ చెక్‌లిస్ట్'ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి సంస్థ తాము మహిళా భద్రత విషయంలో ఎంతవరకు నిబంధనలు పాటిస్తున్నామో స్వయంగా అంచనా వేసుకోవచ్చు. అంతర్గత కమిటీల ఏర్పాటు నుండి, అవగాహన సదస్సుల నిర్వహణ వరకు అన్ని అంశాలను ఈ చెక్‌లిస్ట్ పర్యవేక్షిస్తుంది.

పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం - గణాంకాల సాక్షిగా

కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి తన ప్రసంగంలో ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించారు. గత ఆరేళ్లలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం 23 శాతం నుండి 42 శాతానికి పెరగడం విశేషం. ప్రస్తుతం 1.48 లక్షల సంస్థలు షీ -బాక్స్ పోర్టల్‌లో నమోదయ్యాయి. ఈ పెరుగుతున్న భాగస్వామ్యానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలు కూడా అంతే బలంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

అసంఘటిత రంగంపై ప్రత్యేక నిఘా

భారతదేశంలో 80 శాతానికి పైగా మహిళలు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరి రక్షణ కోసం ప్రతి జిల్లాలో 'లోకల్ కమిటీలు' ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పొలాల్లో పనిచేసే కూలీల నుండి, భవన నిర్మాణ కార్మికుల వరకు ప్రతి ఒక్క మహిళకు ఈ రక్షణ వ్యవస్థ అందుబాటులో ఉండాలని, ఎక్కడ వేధింపులు జరిగినా ఫిర్యాదు చేసే ధైర్యం వారికి కల్పించాలని కార్యదర్శి అనిల్ మాలిక్ స్పష్టం చేశారు.

ఆర్థిక సాధికారతతో కూడిన భద్రత

మంత్రి సావిత్రి ఠాకూర్ మాట్లాడుతూ, ఆర్థిక స్వతంత్రత ఉన్నప్పుడే మహిళ తనపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించగలదని పేర్కొన్నారు. ముద్రా లోన్లు, పీఎం స్వనిధి వంటి పథకాల ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని, 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా బలోపేతం అయ్యారని ఆమె గుర్తు చేశారు. ఈ ఆర్థిక బలం, షీ-బాక్స్ వంటి చట్టపరమైన బలం కలిసి మహిళలను అజేయులుగా మారుస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

జాతీయ భద్రతా ప్రతిజ్ఞ - సామాజిక బాధ్యత

ఈ సదస్సులో నిర్వహించిన 'నేషనల్ వర్క్‌ప్లేస్ సేఫ్టీ ప్లెడ్జ్' ఒక సామాజిక చైతన్యాన్ని కోరుతోంది. మహిళలను గౌరవించడం అనేది కేవలం ఒక చట్టం కాదు, అది మన సంస్కృతిలో భాగం కావాలని ఈ ప్రతిజ్ఞ ఉద్బోధిస్తుంది. ప్రతి కార్యాలయం ఒక సురక్షితమైన దేవాలయంలా ఉండాలని, అక్కడ ప్రతి మహిళా తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే వాతావరణం ఉండాలని ఈ ప్రతిజ్ఞ ద్వారా పిలుపునిచ్చారు.

2047 నాటికి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, అది మహిళా నేతృత్వంలోని అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. షీ-బాక్స్ వంటి చొరవలు మహిళల్లో భద్రతా భావాన్ని నింపి, వారు మరింత ఉత్సాహంగా దేశ నిర్మాణంలో పాలుపంచుకునేలా చేస్తాయి. ఏ రోజైతే ఒక మహిళ తన పని ప్రదేశంలో ఎటువంటి భయం లేకుండా చిరునవ్వుతో పని చేయగలుగుతుందో, అదే నిజమైన వికసిత భారత్.

షీ-బాక్స్ పోర్టల్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్:

https://shebox.wcd.gov.in/

షీ- బాక్స్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదును నమోదు చేయడం చాలా సులభం. ముందుగా మీరు అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి 'రిజిస్టర్ యువర్ కంప్లయింట్' బటన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీరు ప్రభుత్వ ఉద్యోగియా లేదా ప్రైవేట్ రంగ మహిళా అనే ఆప్షన్‌ను ఎంచుకున్నాక, మీ వ్యక్తిగత వివరాలు, కార్యాలయ సమాచారం, మీకు ఎదురైన వేధింపుల గురించి క్లుప్తంగా వివరించాల్సి ఉంటుంది. అన్ని వివరాలు నింపి సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ లేదా ఈమెయిల్‌కు ఒక కంప్లైంట్ ఐడి వస్తుంది, దీని ద్వారా మీ ఫిర్యాదుపై జరుగుతున్న విచారణను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేయవచ్చు.

మహిళా లోకానికి రక్షా కవచం: 'షీ-బాక్స్' ఒక విశ్లేషణ - Tholi Paluku