
మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ప్రతిపక్షాలే కోరాయి: ప్రధాని మోడీ
మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ను 2029 నాటికి అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలే కోరాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. రాజధానిలో జరిగిన ‘నారి శక్తి వందన్ సమ్మేళన్’లో సోమవారం ప్రసంగించిన ఆయన, 2023లో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తు చేశారు. అప్పట్లో ప్రతిపక్ష సభ్యులు కూడా 2029లోపు ఈ చట్టాన్ని అమలు చేయాలని స్పష్టంగా కోరారని అన్నారు. పార్లమెంట్‌లో ఏప్రిల్ 16 నుంచి ఈ అంశంపై సమగ్ర చర్చ జరగనుందని, అన్ని పార్టీల సహకారంతో మహిళా రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకుంటామని మోడీ తెలిపారు. రాజకీయాలను పక్కనబెట్టి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంటే దేశంలోని మహిళలు ఆనందిస్తారని ఆయన అన్నారు.
జనగణన, డీలిమిటేషన్‌తో అనుసంధానం
ఈ చట్టం అమలును కొత్త జనగణన, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో అనుసంధానించినట్లు కేంద్రం తెలిపింది. జనగణన ఆలస్యమైన నేపథ్యంలో డీలిమిటేషన్ కోసం 2011 జనగణన గణాంకాలను ఉపయోగించే ప్రతిపాదనపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం మహిళలకు మూడవ వంతు రిజర్వేషన్ అమలు చేయనున్నారు.
పంచాయతీరాజ్‌లో మహిళల పాత్ర
దేశంలో మహిళా నాయకత్వానికి పంచాయతీరాజ్ వ్యవస్థ మంచి ఉదాహరణగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 లక్షలకుపైగా మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నారని తెలిపారు. సుమారు 21 రాష్ట్రాల్లో పంచాయతీల్లో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 50 శాతానికి చేరుకుందని చెప్పారు.
మహిళలకు కీలక పదవులు
భారతదేశంలో రాష్ట్రపతి నుంచి ప్రధాని వరకు కీలక పదవులను మహిళలు నిర్వహించినట్లు ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా దేశ గౌరవాన్ని పెంచే కీలక పదవుల్లో మహిళలు ఉన్నారని ఆయన అన్నారు. 2014 తర్వాత మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మోదీ పేర్కొన్నారు. బేటీ బచావో, బేటీ పడావో, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, సుకన్యా సమృద్ధి యోజన వంటి పథకాల ద్వారా బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతపై దృష్టి పెట్టామని తెలిపారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ప్రధాని, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా ఈ చట్టం అమలు అవుతుందని చెప్పారు. దేశంలోని ప్రతి తల్లి, చెల్లి, కుమార్తె ఆశయాలను దేశం అర్థం చేసుకుంటోంది. వారి కలలను నిజం చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశం
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్ ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుంచి సుమారు 816కు పెరిగే అవకాశముందని సమాచారం. అయితే ప్రస్తుత విధానంలో ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) కోసం ప్రత్యేక రిజర్వేషన్ ప్రతిపాదన లేదు. షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్లు మాత్రం యథాతథంగా కొనసాగనున్నాయి.
మహిళల దృక్పథం మార్చడమే ‘నారీ శక్తి వందన్’ చట్టం లక్ష్యం: ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్
మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో రిజర్వేషన్ కల్పించే నారీశక్తి వందన్ అధినియమ్ కేవలం రిజర్వేషన్ చట్టం మాత్రమే కాకుండా మహిళలు నిర్ణయాధికారంలో పాల్గొనే విషయంలో సమాజ దృక్పథాన్ని మార్చే ప్రయత్నమని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్‌పర్సన్ విజయ రహట్కర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’లో సోమవారం ఆమె ప్రసంగించారు. ఈ చట్టం మహిళలకు సంఖ్యాపరమైన ప్రాతినిధ్యం ఇవ్వడమే కాకుండా పాలన, విధానాల రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కీలక అడుగని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా , కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి , కేంద్ర మంత్రి సావిత్రి ఠాకూర్ తదితరులు హాజరయ్యారు.
