Let's talk: editor@tmv.in
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు.. కేసు నమోదు

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు.. కేసు నమోదు

Gaddamidi Naveen
20 జులై, 2026

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ) లో ఒక కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. తనను వెంటాడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి (30) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెతోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిపై శనివారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మహిళా అధికారిణి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సదరు తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి జూన్ 23 నుంచి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా తనకు అసభ్యకరమైన, లైంగిక వేధింపులతో కూడిన సందేశాలను పంపుతున్నాడు. అంతేకాకుండా, అకాడమీ ప్రాంగణంలోనే ఆమె స్నేహితుల ముందే తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. తనకు మరొక ట్రైనీ అధికారితో లైంగిక సంబంధం ఉందంటూ నిందలు వేస్తూ, ఆ విషయాన్ని ఒప్పుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడని, అసభ్య పదజాలంతో దూషించాడని ఆమె ఆరోపించారు.

బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ తన వ్యక్తిగత సందేశాలను చూపించాలని ఒత్తిడి చేశాడని బాధితురాలు పేర్కొన్నారు. జూలై 8న ఆమె మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కొని తన గదికి తీసుకెళ్లాడని, పాస్‌వర్డ్ చెప్పాలని వేధించాడని తెలిపారు. ఆ సమయంలో అతను తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. జూలై 9న సదరు అధికారి తనను అక్రమంగా నిర్బంధించి, బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి, జుట్టు పట్టుకుని గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా మెడపై కత్తి పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తూ గదిలో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడని, ఆ మరుసటి రోజు (జూలై 10) కూడా తనపై భౌతికంగా దాడి చేశాడని వివరించారు.

అంతేకాకుండా, తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి, తనను బ్లాక్‌మెయిల్ చేసే ఉద్దేశంతో ఆ వీడియోను తన భర్తకు పంపాడని మహిళా అధికారిణి పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ ఘోరమైన వేధింపుల ఫిర్యాదు ఆధారంగా, అత్తాపూర్ పోలీసులు సదరు ట్రైనీ ఐపీఎస్ అధికారిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళపై దాడి లేదా క్రిమినల్ బలప్రయోగం, లైంగిక వేధింపులు, మహిళా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం, వెంటాడటం వంటి ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) లోని సంబంధిత సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక చట్టం(ఐటీ) కింద శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు.

ట్యాగ్‌లు
HyderabadTelanganaIPSPoliceAcademySVPNPACrimeNewsBreakingNewsLatestNewsWomenSafetySexualHarassmentJusticeLawAndOrderTeluguNews
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు.. కేసు నమోదు - Tholi Paluku