
మహిళా కబడ్డీ వరల్డ్ కప్ కైవసం
మహిళా కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఫైనల్లో చైనీస్ తైపీపై 35–28 తేడాతో విజయం సాధించిన భారత జట్టు మరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 2012లో జరిగిన తొలి ప్రపంచ కప్ తరువాత, భారత మహిళా జట్టు ఇది రెండోసారి కిరీటం గెలుచుకోవడం. నవంబర్ 17 నుండి 24 వరకు మిర్‌పూర్‌లోని షహీద్ సుహ్రావర్దీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ల నుంచి మొత్తం 11 దేశాలు పాల్గొన్నాయి. అర్జెంటినా అర్హత సాధించినప్పటికీ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే తప్పుకుంది. బంగ్లాదేశ్ తమ వేదికగా మొదటిసారి ప్రపంచ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది.
గ్రూప్ దశను భారత్ ఘనంగా ఆరంభించింది. థాయ్‌లాండ్ (65–20), జర్మనీ (63–22), బంగ్లాదేశ్ (43–18), ఉగాండా (51–16)పై వరుస విజయాలు సాధించి గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. రైడర్లు, డిఫెండర్లు రెండుసార్లా సమతూకంతో ఆడిన భారత జట్టు ఆరంభం నుంచే దూకుడు చూపించింది.
సెమీ ఫైనల్లో భారత్ ఇరాన్‌ని 33–21తో చిత్తుచేసింది. ఇరాన్ వేగవంతమైన దాడులకు భారత రక్షణ గట్టి సమాధానం ఇచ్చింది. కీలక సమయాల్లో రైడర్లు పాయింట్లు సాధిస్తూ మ్యాచ్‌ను భారత్ వైపుకు మళ్లించారు.ఫైనల్లో అయితే పరిస్థితి కొద్దిగా భిన్నంగా కనిపించింది. గ్రూప్ బి లో ఐదు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో అజేయంగా వచ్చిన చైనీస్ తైపీ బలమైన పోటీ అందించింది. వారి కట్టు దిట్టైన డిఫెన్స్, వ్యూహాత్మక రైడ్‌లు భారత్‌కు సవాల్‌గా మారాయి. అయినప్పటికీ, భారత జట్టు కీలక సమయాల్లో ఆల్‌అవుట్ దక్కించుకోవడం, రైడర్లు బోనస్ పాయింట్లు సాధించడం మ్యాచ్‌ను భారత్ పక్షానకి తిప్పింది.
కెన్యా, జాంజిబార్, పోలాండ్, ఇరాన్ వంటి జట్లపై చైనీస్ తైపీ వరుస విజయాలు నమోదు చేసింది. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 25–18తో గెలిచి ఫైనల్‌కి చేరుకుంది. టైటిల్ గెలవకపోయినా, ఈ జట్టు ప్రదర్శన ప్రపంచ కబడ్డీలో తమ ఎదుగుదలను స్పష్టంగా చూపించింది.
గ్రూప్ ఏ లో భారత్ అగ్రస్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ రెండో స్థానంతో సెమీ ఫైనల్‌కి చేరింది. థాయ్‌లాండ్, ఉగాండా, జర్మనీ వరుస స్థానాల్లో నిలిచాయి.
గ్రూప్ బి లో చైనీస్ తైపీ మొదటి స్థానం, ఇరాన్ రెండో స్థానం, నేపాల్ మూడో స్థానం దక్కించుకున్నాయి. నేపాల్ గ్రూప్‌లో చైనీస్ తైపీని ఓడించినప్పటికీ సెమీ ఫైనల్‌కి చేరలేకపోయింది.
పోలాండ్‌పై కెన్యా 80–19 తేడాతో సాధించిన విజయం, జాంజిబార్ 79–10తో పోలాండ్‌ను ఓడించడం వంటి మ్యాచ్‌లు ఈ టోర్నమెంట్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
ఇరాన్ 55–11, 51–15 తేడాతో పెద్ద విజయాలు నమోదు చేయడం, కొత్త జట్ల ప్రదర్శనలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
ఈ వరల్డ్ కప్‌ను ఆతిథ్యం ఇవ్వడం బంగ్లాదేశ్‌కు ఒక పెద్ద మైలురాయి. కబడ్డీకి అక్కడ ఉన్న ప్రాచుర్యం కారణంగా మ్యాచ్‌లు భారీ జనసందోహంతో జరిగాయి. బంగ్లాదేశ్ జట్టు మూడు విజయాలు సాధించి సెమీ ఫైనల్‌కి చేరడం, ప్రేక్షకుల ఉత్సాహానికి కారణమైంది.
భారత్ వెలుపల వరల్డ్ కప్ విజయవంతంగా నిర్వహించడం కబడ్డీ గ్లోబల్ ప్రెజెన్స్ పెరుగుతున్నదని సూచించింది. జర్మనీ, పోలాండ్, జాంజిబార్, కెన్యా వంటి దేశాల పాల్గొనడం కబడ్డీ మరింతగా వ్యాప్తి చెందుతున్నదన్నది స్పష్టమైంది.
అంతర్జాతీయ కబడ్డీ అధికారులు ఈ టోర్నమెంట్ భవిష్యత్తుకు దృఢమైన పునాది వేశారు అని పేర్కొన్నారు.ఢాకాలో సాధించిన ఈ విజయం భారత కబడ్డీ జట్టు మరోసారి ప్రపంచానికి నిరూపించింది. 13 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌ను తిరిగి సాధించడం భారత మహిళా కబడ్డీ జట్టుకు పెద్ద గర్వకారణంగా నిలిచింది.
