Let's talk: editor@tmv.in
మహిళా ఐఏఎస్ అధికారిపై నిరాధార కథనాలు.. జర్నలిస్టుల విచారణ

మహిళా ఐఏఎస్ అధికారిపై నిరాధార కథనాలు.. జర్నలిస్టుల విచారణ

Pinjari Chand
15 జనవరి, 2026

తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిపై దూషణాత్మక కంటెంట్ ప్రసారం చేసిన కేసులో ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు బుధవారం విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు, కల్పిత, ఆధారంలేని వార్తలు ప్రచారం చేశారంటూ తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు కొన్ని న్యూస్ చానళ్లతో పాటు ఇతర మీడియా సంస్థలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేశారన్న ప్రచారంపై స్పందించిన ఓ సీనియర్ పోలీస్ అధికారి, వారిని కేవలం విచారణ కోసం పిలిచామని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ పోలీసులు ఈ నెల 12న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, జర్నలిస్టుల అదుపు వ్యవహారంపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను అరెస్టు చేసిందంటూ ఆరోపిస్తూ, ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి.

వారిని వెంటనే విడుదల చేయాలి

ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, పండుగ పూట ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోంది. జర్నలిస్టులను క్రిమినల్స్‌లా వ్యవహరించడంపై తెలంగాణ డీజీపీ తీరుపై ఆందోళన కలుగుతోందని వ్యాఖ్యానించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ కేసులో నమోదైన సెక్షన్లు ఏవీ నాన్-బెయిలబుల్ కావని, అయినప్పటికీ అర్ధరాత్రి అరెస్టుల ద్వారా జర్నలిస్టులు, వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం పోలీసులను వాడుకోవద్దని, న్యాయ ప్రక్రియను పాటించాలని డీజీపీని కోరారు.

వాళ్లు జర్నలిస్టులు.. టెర్రరిస్టులు కాదు

సీనియర్ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా ఎక్స్‌లో స్పందిస్తూ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై చేసిన దాడి. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న వరుస అరెస్టుల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు.అర్ధరాత్రి, పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ప్రొసీజర్ పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని హరీశ్ రావు నిలదీశారు. జర్నలిస్టులు ఎవరూ క్రిమినల్స్, టెర్రరిస్టులు గానీ కాదని, అలాంటి వారిపట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ విధమైన చర్యల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయని, పండుగ వేళ ఇటువంటి అరెస్టులు చేయడం అత్యంత అనుచితమని ఆయన వ్యాఖ్యానించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులకు హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కూడా ముగ్గురు జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టును తీవ్రంగా ఖండించారు.

ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై నేరుగా చేసిన ప్రమాదకర దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా వర్గాల పక్షాన బీజేపీ నిలబడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులు, ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం ద్వారా పత్రికా స్వేచ్ఛను అణిచివేయడానికి ప్రయత్నిస్తే సహించబోమని రామచందర్ రావు స్పష్టం చేశారు.

మహిళా అధికారిపై ఆధారాల్లేని విమర్శలతోనే కేసులు : పోలీస్ కమిషనర్ సజ్జనార్

హైదరాబాద్‌లో మహిళా ఐఏఎస్ అధికారిపై దూషణాత్మక వ్యాఖ్యలు, ఆధారాలు లేని ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఐపీఎస్ స్పష్టం చేశారు. సీఎంపై అవమానకరంగా వార్తలు ప్రసారం చేయడం, మహిళా అధికారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం కారణంగానే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రముఖ టీవీ ఛానెల్స్‌కు చెందిన రిపోర్టర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై ఆరోపణలు చేయడం క్రూరత్వమని సజ్జనార్ వ్యాఖ్యానించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అలాంటి మహిళలపై విమర్శలు చేస్తే వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలపై మాట్లాడాల్సి రావడం బాధాకరమని, సృష్టికి మూలం అమ్మ అని, అమ్మ అంటే స్త్రీ అని అన్నారు. మహిళను విమర్శించడం అంటే సృష్టినే విమర్శించినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని ఎమర్జెన్సీతో పోల్చడం సరికాదని, పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. కొందరు ‘బ్యాంకాక్’ పేరుతో అర్థరాత్రి పారిపోతున్నారని వ్యాఖ్యానించిన సజ్జనార్, చట్టప్రకారమే పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఎక్కడా తలుపులు పగలగొట్టలేదని స్పష్టం చేశారు. విచారణకు సహకరించాలని, సహకరించని పక్షంలో చట్టప్రకారం అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.

మహిళా ఐఏఎస్ అధికారిపై నిరాధార కథనాలు.. జర్నలిస్టుల విచారణ - Tholi Paluku