
మహిళల హాకీ వరల్డ్ కప్ అర్హత పై భారత్ దృష్టి
కొత్తగా బాధ్యతలు చేపట్టిన, భారత జట్టుకు పరిచయమైన కోచ్ జోయెర్డ్ మరిజ్నే మార్గదర్శకత్వంలో, భారత మహిళల హాకీ జట్టు వచ్చే ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా క్వాలిఫయర్స్‌లో తమ తొలిపోరును ఆదివారం ప్రారంభించనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఉరుగ్వేతో తలపడనుంది. ఈ క్వాలిఫయర్ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య దేశమైన భారత్‌తో పాటు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా 2026 వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే ఉరుగ్వేపై భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్ తర్వాత భారత్ మార్చి 9న స్కాట్లాండ్‌తో, మార్చి 11న వేల్స్‌తో తలపడనుంది.
2026 మహిళల హాకీ వరల్డ్ కప్‌ను బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆగస్టు 14 నుంచి 30 వరకు నిర్వహించనున్నాయి. అదే సమయంలో పురుషుల వరల్డ్ కప్ కూడా జరుగుతుంది.
ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 9వ స్థానంలో ఉంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లలో ఇంగ్లాండ్ (7వ స్థానం) తర్వాత రెండో అత్యుత్తమ ర్యాంక్ భారత్‌కే ఉంది. భారత జట్టు కెప్టెన్ సలిమా టెటె మాట్లాడుతూ, స్వదేశంలో అభిమానుల ముందే ఈ క్వాలిఫయర్స్ ఆడటం ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు. ఈ టోర్నీ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. వరల్డ్ కప్‌కు అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్ కఠినంగానే ఉంటుందని ఆమె చెప్పారు.
క్వాలిఫయర్స్‌లో జట్లను రెండు పూల్‌లుగా విభజించారు.
• పూల్–ఏ: ఇంగ్లాండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా
• పూల్–బీ: భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్
ప్రతి పూల్‌లోని తొలి రెండు జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. రెండు సెమీఫైనల్స్ విజేతలు, మూడో స్థానం మ్యాచ్ విజేత వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. అలాగే ఈ టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో అత్యధిక ప్రపంచ ర్యాంక్ ఉన్న జట్టుకూ వరల్డ్ కప్‌లో అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు భారత మహిళల జట్టు వరల్డ్ కప్‌లో ఎనిమిది సార్లు పాల్గొంది. 1974లో జరిగిన తొలి వరల్డ్ కప్‌లో నాలుగో స్థానం సాధించడం భారత్‌కు ఇప్పటివరకు ఉత్తమ ప్రదర్శనగా ఉంది. ప్రస్తుతం భారత జట్టు తొమ్మిదోసారి వరల్డ్ కప్‌లో చోటు సంపాదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
భారత మహిళల హాకీ జట్టు
హైదరాబాద్‌లో మార్చి 8 నుంచి 14 వరకు జరిగే ఈ పోటీల కోసం హకీ ఇండియా 20 మంది సభ్యులతో కూడిన భారత మహిళల హాకీ జట్టును ప్రకటించింది. ఈ టోర్నీ ద్వారా 2026 మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.
జట్టుకు అనుభవజ్ఞురాలు అయిన మిడ్‌ఫీల్డర్ సలిమాటెటె కెప్టెన్‌గా కొనసాగనున్నారు. గోల్‌కీపింగ్ బాధ్యతలను బన్సారి సోలంకి, బిచు దేవి ఖరిబామ్ పంచుకోనున్నారు.
భారత మహిళల హాకీ జట్టు (20 మంది):
గోల్‌కీపర్లు:
బన్సారి సోలంకి, బిచు దేవి ఖరిబామ్
డిఫెండర్లు:
సుషీలా చాను పుఖ్రంబామ్, నిక్కీ ప్రధాన్, మనీషా చౌహాన్, ఉదితా, ఇషికా చౌధరి
మిడ్‌ఫీల్డర్లు:
సలీమా టేటే (కెప్టెన్), నేహా, సునేలితా టోప్పో, సాక్షి రాణా, వైష్ణవి విఠల్ ఫాల్కే, రుతుజా దాదాసో పిసాల్, దీపికా సోరెంగ్
ఫార్వర్డ్స్:
నవనీత్ కౌర్, ఇషికా, లాల్రెంసియామి, బ్యూటీ డుంగ్‌డుంగ్, బల్జీత్ కౌర్, అన్ను ఉన్నారు. ఈ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన కనబరిస్తే వచ్చే మహిళల హాకీ వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది.
