
మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేడు నెల్లూరులో ‘మహిళా జన సున్వాయి’
నెల్లూరు జిల్లా మహిళల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మహిళా కమిషన్ ముంగిటకే వస్తోంది. కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ నేతృత్వంలో నేడు నెల్లూరు నగరంలో ‘మహిళా జన సున్వాయి’ (బహిరంగ విచారణ) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మహిళా కమిషన్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
జాతీయ మహిళా కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక డ్రైవ్, నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగుతుంది. మహిళలపై జరుగుతున్న వేధింపులు, గృహహింస, ఆస్తి వివాదాలు ఇతర సామాజిక సమస్యలపై బాధితుల నుంచి చైర్‌పర్సన్ నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తారు. మహిళా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పోలీస్, రెవెన్యూ ఇతర శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమస్యలను విశ్లేషించి బాధితులకు తక్షణ న్యాయం చేకూర్చడమే ఈ ‘జన సున్వాయి’ ముఖ్య ఉద్దేశం.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
జిల్లాలోని బాధిత మహిళలు ఎవరైనా తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని రాయపాటి శైలజ పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, పోలీస్ స్టేషన్ల పరిధిలో పరిష్కారం కాని ఫిర్యాదులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధైర్యంగా ముందుకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకోవాలని మహిళా రక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
