
మహిళల భద్రత మా బాధ్యత: సీపీ సజ్జనార్
మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, స్పష్టం చేశారు. ముఖ్యంగా డిజిటల్ బ్లాక్‌మెయిలింగ్, సైబర్ వేధింపులకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. గత ఏడాది కాలంలో హైదరాబాద్ షీ టీమ్స్ సాధించిన విజయాలు, గణాంకాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
ఏడాది విజయాల నివేదిక
గత ఒక ఏడాదిలో హైదరాబాద్ షీ టీమ్స్ మొత్తం 1,149 ఫిర్యాదులను పరిష్కరించాయి. అండర్‌కవర్ నిఘా, డికాయ్ ఆపరేషన్లు, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ 2025లో 3,826 మంది వేధింపులకారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అని తెలిపారు. మహిళలు భయంతో లేదా సమాజ భయంతో మౌనంగా ఉండకూడదని కమిషనర్ సూచించారు. బాధితుల గుర్తింపు, గౌరవం మా బాధ్యత. మీ గోప్యతను కాపాడుతూ, ప్రతి మహిళకు పోలీసులు అండగా నిలుస్తారు, అని భరోసా ఇచ్చారు.
డిజిటల్ బ్లాక్‌మెయిలింగ్ పెరుగుతున్న ముప్పు
గత ఏడాది నమోదైన కేసుల విశ్లేషణలో సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరిగినట్టు తేలింది. 366 కేసులతో బ్లాక్‌మెయిలింగ్ ప్రధాన నేరంగా నిలిచింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పరిచయం పెంచుకుని, వీడియో కాల్స్ లేదా ఫోటోలను దుర్వినియోగం చేసి డబ్బు లేదా లైంగిక లాభాలు ఆశించడం ఎక్కువగా కనిపించింది. కొందరు మాజీ ప్రేమికులు పాత ఫోటోలతో బెదిరించి పెళ్లిళ్లు చెడగొట్టే ప్రయత్నాలు చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇంటర్నెట్ కాల్స్ ద్వారా అర్థరాత్రి వేధించిన 121 కేసులు, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టిన 82 కేసులను షీ టీమ్స్ ఛేదించాయి.
ఆన్‌లైన్ వేదికగా వేధించే ‘సైకాలజికల్ వాయురిజం’ కేసులు పెరిగాయి. అర్ధరాత్రి ఇంటర్నెట్ కాల్స్, ఫేక్ ప్రొఫైల్స్ అసభ్య కంటెంట్‌తో మహిళలను వేధిస్తున్న ఉదంతాలపై షీ టీమ్స్ ఉక్కుపాదం మోపాయి. సుమారు 250కి పైగా కేసుల్లో ఫోరెన్సిక్ టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించి, బాధితులకు మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కల్పించారు.
బాధితుల వేదన
22 ఏళ్ల యువతి తన అనుభవాన్ని పంచుకుంటూ, ఒక బటన్ నొక్కితే నా జీవితం నాశనం అవుతుందన్న భయం నన్ను క్షణం కూడా వదలలేదు. షీ టీమ్స్‌ను సంప్రదించిన తర్వాతే నాకు ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. వారు నిందితుడిని మాత్రమే కాదు, నా గౌరవాన్ని కూడా కాపాడారు అని చెప్పింది.
మరొక ఉద్యోగిని మాట్లాడుతూ, ప్రేమ పేరుతో మొదలైన వేధింపులు చివరకు ప్రాణహానీ బెదిరింపుల వరకు వెళ్లాయి. ఆఫీస్ కూడా భద్రత లేని స్థలంగా మారింది. షీ టీమ్స్ నాకు కవచంలా నిలిచాయి అని పేర్కొంది.ఆ ఆకతాయిని అరెస్ట్ చేయడంతో ఆమె ఇప్పుడు ధైర్యంగా తన పనులు చేసుకోగలుగుతోంది.
బాధితులకు తక్షణ ఉపశమనం
షీ టీమ్స్ చర్యల వల్ల అనేక మంది మహిళలకు తక్షణ సహాయం లభించింది. ఒక ఘటనలో, ఓ యువతి తన స్నేహితుడితో వ్యక్తిగత ఫోటోలు పంచుకోగా, తరువాత అతడు వాటిని ఆధారంగా చేసుకుని డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగాడు. సామాజిక పరువు పోతుందన్న భయంతో కొంతకాలం మౌనంగా ఉన్న ఆమె చివరకు షీ టీమ్స్‌ను ఆశ్రయించగా, వెంటనే నిందితుడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మరో ఘటనలో, ఒక వర్కింగ్ ఉమెన్ తనను వెంటాడుతూ బెదిరిస్తున్న వ్యక్తిని బ్లాక్ చేసినా వేధింపులు ఆగలేదు. షీ టీమ్స్ జోక్యంతో ఆమెకు రక్షణతో పాటు చట్టపరమైన మద్దతు లభించింది.
వివాహ వాగ్దానం పేరుతో మోసం
వివాహం చేస్తానని చెప్పి మహిళలను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దోపిడీ చేసిన 98 కేసులను షీ టీమ్స్ పరిష్కరించాయి. బాధితులకు కౌన్సెలింగ్ అందించి, నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
క్షేత్రస్థాయి నిఘా
ఫిర్యాదులకే పరిమితం కాకుండా, 15 షీ టీమ్స్ బృందాలు సివిల్ డ్రస్‌లో బస్సు స్టేషన్లు, కాలేజీలు, రద్దీ ప్రాంతాల్లో నిఘా కొనసాగించాయి. పట్టుబడిన వారిలో చాలామందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వగా, తీవ్రమైన కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టులు, న్యాయ కస్టడీకి పంపించామని కమిషనర్ పేర్కొన్నారు.
ఫిర్యాదు ఎలా చేయాలి?
మహిళలు ఏ విధమైన వేధింపులకు గురైనా డయల్ 100 ద్వారా లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 949061655కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళల భద్రతే లక్ష్యంగా – హైదరాబాద్ షీ టీమ్స్ అండగా నిలుస్తున్నాయి.
