
మహిళల భద్రతపై వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలను ఖండిస్తూ, గుంటూరులో ఓ మహిళను వివస్త్రను చేసి వేధించిన ఘటనకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో మహిళా నేతలు, పార్టీ కార్యకర్తలు ర్యాలీలు, ధర్నాలు చేపట్టి మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలు ప్రాంతాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని కోరారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్‌రావు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు మహిళా నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు.
గుంటూరు లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోతిన మహేష్, అంబటి మురళీకృష్ణ, బలసాని కిరణ్‌కుమార్, డైమండ్ బాబు తదితరులు పాల్గొని మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కార్యాలయం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన నిరసనలో మహిళా విభాగం నేత ఉప్పాల హారిక మాట్లాడుతూ మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గుంటూరు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
