
మహిళల భద్రతకు సరికొత్త వ్యవస్థ: మంత్రి సీతక్క కీలక సమీక్ష
రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం, సాధికారతను మరింత బలోపేతం చేసేందుకు పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో ఆమె విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.అలాగే రాబోయే ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేయనున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల డిజైన్లను మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ పరిశీలించారు.
వ్యవస్థాపక లోపాలపై చర్చ
రాష్ట్రంలో ఇప్పటికే షీ టీమ్స్, భరోసా కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, అయితే విద్యాసంస్థలు, హాస్టళ్లు, కార్యాలయాలు, అసంఘటిత రంగాల్లో ఇంకా కొన్ని వ్యవస్థాపక లోపాలు ఉన్నాయని ఈ సమావేశం అభిప్రాయపడింది. ముఖ్యంగా రాత్రి వేళల ప్రయాణాలు, డిజిటల్ వేదికలపై మహిళల భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా మౌలిక వసతులు, సాంకేతికత, అవగాహన కార్యక్రమాలు, పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనల సమన్వయంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీల్లో ఐసీసీ కమిటీల పనితీరుపై తప్పనిసరి ఆడిట్ వ్యవస్థ అమలు చేయాలని సూచించారు.
రాత్రి 8 గంటల తర్వాత మహిళా ఉద్యోగులకు జీపీఎస్ అనుసంధానిత సురక్షిత రవాణా సదుపాయం కల్పించాలని ఆదేశించారు. అసంఘటిత రంగ మహిళల కోసం ప్రత్యేక నమోదు, గుర్తింపు కార్డు, సులభ ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజా రవాణాలో సీసీటీవీ పర్యవేక్షణను బలోపేతం చేసి, పీక్ అవర్స్‌లో భద్రతా ఆడిట్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి సంజయ్ కుమార్, శికా గోయల్, క్రిస్టినా చొంగ్తు, అనితా రామచంద్రన్, ప్రియాంకా వర్గీస్, తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
