Let's talk: editor@tmv.in
మహిళల భద్రతకు మగవారే బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల భద్రతకు మగవారే బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
8 మార్చి, 2026

హైదరాబాద్‌లో మహిళల భద్రత, గౌరవం, సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” క్యాంపెయిన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జేఎన్‌టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం క్యాంపెయిన్ బ్రోచర్‌ను ఆవిష్కరించి, సమాజంలో మహిళల రక్షణ అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పురుషుడు మహిళా భద్రతకు ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా నిలబడాలని సీఎం పిలుపునిచ్చారు.

నిలబడి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోండి

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మహిళల భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా సామాజిక బాధ్యతగా కూడా భావించాలని అన్నారు. మహిళలను వేధించే ఘటనలు ఎదురైనప్పుడు యువత ముందుకు వచ్చి ప్రశ్నించే ధైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఎవరైనా ఆడపిల్లను ఇబ్బందులకు గురిచేస్తే చూసి చూడనట్టుగా ఉండటం కూడా నేరాన్ని ప్రోత్సహించినట్లేనని ఆయన స్పష్టం చేశారు. సొంత కుటుంబ సభ్యులకు వేధింపులు ఎదురైతే ఎలా స్పందిస్తామో, ఇతర మహిళల విషయంలో కూడా అదే తీరుగా ఆలోచించాలని అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు మాత్రమే కాకుండా మహిళల పట్ల మన దృక్పథంలో మార్పు రావాలని సీఎం పేర్కొన్నారు. మహిళను శక్తిగా భావిస్తూ, కుటుంబ గౌరవంగా చూస్తున్నప్పటికీ, బయటకు వెళ్లేటప్పుడు వారు అభద్రతా భావంతో ఉండే పరిస్థితులు కొనసాగడం బాధాకరమని అన్నారు. అలాంటి పరిస్థితులను మార్చుకోవాల్సిన అవసరం సమాజానికే ఉందని చెప్పారు.

మహిళా సాధికారతకు తెలంగాణ కేరాఫ్

మహిళల శక్తి సామర్థ్యాలపై తమ ప్రభుత్వానికి గట్టి నమ్మకం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలోని కీలక విభాగాలతో పాటు ప్రభుత్వంలోని అనేక ప్రధాన శాఖలకు మహిళలే అధిపతులుగా ఉన్నారని తెలిపారు. ఒక రాష్ట్రం లేదా దేశం నిజమైన పురోగతిని సాధించాలంటే మహిళలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం వివరించారు. ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుమీద మంజూరు చేయడం, వడ్డీ లేని రుణాలు అందించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టీసీ బస్సుల యాజమాన్యంలో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టామని, 'తెలంగాణ తల్లి' విగ్రహాన్ని ఆడబిడ్డల స్ఫూర్తికి చిహ్నంగా ప్రతిష్టించుకున్నామని గుర్తుచేశారు.

ప్రస్తుత కాలంలో శారీరక వేధింపుల కంటే ఆన్‌లైన్ క్రైమ్, డీప్ ఫేక్ వీడియోల ముప్పు పెరిగిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని పటిష్టం చేశామని స్పష్టం చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు బాధితురాలినే తప్పుపట్టే చెడు సంప్రదాయాన్ని సమాజం విడిచిపెట్టాలని అన్నారు. మహిళలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ‘స్టాండ్ విత్ హర్’ అనే నినాదంతో వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మహిళల ముందడుగే కీలకమని ఆయన నొక్కి చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడడంలో పురుషులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని కోరుతూ "స్టాండ్ విత్ హర్" బ్రోచర్‌ను సీఎం ఆవిష్కరించారు.