
మహిళల ప్రపంచకప్‌లో 'ఆజాద్ కశ్మీర్' రచ్చ
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సనా మీర్ మహిళల ప్రపంచకప్‌లో కామెంటరీ సందర్భంగా తాను చేసిన వివాదాస్పద "ఆజాద్ కశ్మీర్" వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. బ్యాటర్ నటాలియా పర్వేజ్ తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను హైలైట్ చేయడానికే ఆ ప్రాంతం గురించి ప్రస్తావించినట్లు ఆమె తెలిపారు.
గురువారం పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు కామెంటరీ చెబుతున్నప్పుడు, పర్వేజ్ నేపథ్యాన్ని వివరిస్తూ ఆమె "ఆజాద్ కశ్మీర్" ప్రాంతానికి చెందినదని సనా పేర్కొన్నారు. దీనిపై భారత అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వ్యాఖ్య అని, క్రీడా వేదికపై ఇలాంటివి తగవని సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏకిపారేశారు. భారత్ ఈ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)గా పరిగణిస్తున్న విషయం తెలిసిందే.
సనా మీర్ వివరణ
ఈ విమర్శలపై సనా మీర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "పాకిస్థాన్ క్రీడాకారిణి స్వస్థలం గురించి నేను చేసిన వ్యాఖ్య, ఆమె పాకిస్థాన్‌లోని ఒక నిర్దిష్ట ప్రాంతం నుండి వచ్చి, ఎదుర్కొన్న సవాళ్లు, ఆమె అద్భుతమైన ప్రయాణాన్ని తెలియజేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఆటగాళ్ల నేపథ్యం గురించి కామెంటరీ చేసేటప్పుడు మేము చెప్పే కథనాలలో ఇది ఒక భాగం. ఈ రోజు నేను మరో రెండు ప్రాంతాల నుండి వచ్చిన ఇతర ఆటగాళ్ల గురించి కూడా ఇదే విధంగా వివరించాను. దయచేసి దీన్ని రాజకీయం చేయవద్దు" అని సనా మీర్ కోరారు.
"వరల్డ్ ఫీడ్‌కు కామెంటేటర్‌గా, మేము కేవలం క్రీడ, జట్లు, ఆటగాళ్లపై దృష్టి పెట్టాలి. వారి పట్టుదల, స్థిరత్వం వంటి స్ఫూర్తిదాయక కథనాలను హైలైట్ చేయాలి. నా మనస్సులో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు లేదా ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదు" అని ఆమె స్పష్టం చేశారు.
కాగా ఈ వ్యాఖ్యలను రాజకీయ వ్యాఖ్యలుగా ఆరోపిస్తూ భారత క్రీడా అభిమానులు ఐసీసీ, బీసీసీఐలను ట్యాగ్ చేసి, క్రీడా ప్రసారంలో రాజకీయాలు చేశారంటూ ఆమెను కామెంటరీ బృందం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే తన వ్యాఖ్యలను అనవసరంగా పెంచి పెద్దది చేశారని సనా అన్నారు. తాను పరిశోధన చేసినప్పుడు నటాలియా ప్రొఫైల్‌లో ఆమెది ‘ఆజాద్ కశ్మీర్’ అనే ఉందని, అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆమె పోస్ట్ చేశారు. వివాదం తలెత్తిన తర్వాత ఇప్పుడు నటాలియా పర్వేజ్ ప్రొఫైల్‌ను మార్చడం గమనార్హం. అయితే సనా మీర్ వివరణ ఇచ్చినప్పటికీ, క్షమాపణ మాత్రం చెప్పలేదు.
