Let's talk: editor@tmv.in
మహిళల టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ భారీగా పెంపు

మహిళల టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ భారీగా పెంపు

Shaik Mohammad Shaffee
14 ఏప్రిల్, 2026

మహిళల క్రికెట్ ప్రాభవాన్ని మరింత పెంచుతూ అంతర్జాతీయ క్రికెట్ మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇంగ్లాండ్, వేల్స్ వేదికలుగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం రికార్డు స్థాయిలో రూ.82 కోట్ల ప్రైజ్ మనీని సోమవారం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మొత్తం పారితోషికాన్ని 10 శాతం పెంచడం విశేషం. మహిళల క్రీడల్లో సమానత్వాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఐసీసీ ఈ భారీ మొత్తాన్ని కేటాయించింది.

విజేతలకు భారీ నజరానా

ఈ మెగా టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు సుమారు రూ. 21.8 కోట్లు దక్కనున్నాయి. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.10 కోట్లు అందజేస్తారు. సెమీఫైనల్‌లో ఓడిపోయిన జట్లకు రూ. 6.29 కోట్ల చొప్పున పారితోషికం లభిస్తుంది. కేవలం సెమీస్ వరకే కాకుండా, గ్రూప్ దశలో సాధించే ప్రతి విజయానికి రూ.29 లక్షల బోనస్ ప్రకటించారు. టోర్నీలో పాల్గొనే మొత్తం 12 జట్లకు కనీసం రూ.2.06 కోట్ల చొప్పున ప్రైజ్ మనీని ఐసీసీ ఖరారు చేసింది.

పెరిగిన జట్ల సంఖ్య.. వేదికలు సిద్ధం

గత ఎడిషన్‌లో 10 జట్లు మాత్రమే తలపడగా, ఈసారి పోటీని మరింత రసవత్తరంగా మార్చేందుకు జట్ల సంఖ్యను 12కు పెంచారు. జూన్ 12 నుంచి జూలై 5 వరకు మొత్తం 24 రోజుల పాటు ఈ క్రీడా సంబరం సాగనుంది. మొత్తం 33 మ్యాచ్‌లను ఏడు వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నారు. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి మేటి జట్లతో పాటు నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి వర్ధమాన జట్లు కూడా ఈ పోరులో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

జూన్ 12 నుంచి మహిళల వరల్డ్ కప్ సందడి

మహిళల టీ20 ప్రపంచకప్ జూన్ 12న ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఘనంగా మొదలవుతుంది. ఈ మెగా టోర్నీ గురించి అందరికీ తెలిసేలా మే 7 నుంచే స్కాట్లాండ్‌లో ప్రపంచకప్ ట్రోఫీ ప్రదర్శన (యాత్ర) ప్రారంభించి, లండన్ వరకు నిర్వహిస్తారు. జట్ల సంఖ్యను పెంచడం, భారీగా బహుమతి నగదును ప్రకటించడం వల్ల మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు.