
మహిళల చేతుల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం
భారతదేశం తన వైవిధ్యంతో ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. భాషలు, వేషధారణలు, సంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కలిసి భారతీయ సమాజాన్ని ఒక సమగ్ర సాంస్కృతిక చట్రంగా మలుస్తాయి. ఈ వైవిధ్యంలో గిరిజన సమాజాల పాత్ర అత్యంత కీలకం. ప్రకృతి ఆధారిత జీవనం, సామూహిక ఆలోచన, ఆధ్యాత్మిక అనుబంధం, కళాత్మక సృజన ఇవన్నీ గిరిజన సంస్కృతికి పునాది. ఈ సంప్రదాయాలను తరతరాలుగా నిలబెట్టడంలో మహిళలు నిర్వహిస్తున్న పాత్ర మరింత ప్రాముఖ్యమైనది.
న్యూఢిల్లీలో నిర్వహించిన ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ (గిరిజన కళల మహోత్సవం) 2026 ఈ జీవంత వారసత్వానికి జాతీయ వేదికగా నిలిచింది. ఇది కేవలం కళా ప్రదర్శన మాత్రమే కాదు. అది సాంస్కృతిక గౌరవానికి, ఆర్థిక సాధికారతకు, మహిళా నాయకత్వానికి ప్రతీక. ఈ ఉత్సవం ద్వారా గిరిజన కళాకారులు తమ ప్రతిభను దేశవ్యాప్తంగా ప్రదర్శించగలిగారు. ఇది సంప్రదాయం, ఆధునికత మధ్య ఒక నిర్మాణాత్మక సంభాషణను ప్రారంభించింది.
సాంస్కృతిక వారసత్వం: అలంకరణ కాదు, జీవన విధానం
గిరిజన కళలు కేవలం గోడలపై గీయబడే చిత్రాలు కాదు. అవి జీవన విధానానికి ప్రతిబింబాలు. వార్లీ, గోండ్, భిల్, సౌరా, సోహ్రై, డోక్రా వంటి కళారూపాలు ప్రకృతి, పంటలు, పండుగలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, సామూహిక జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి రేఖలో ఒక కథ ఉంటుంది. ప్రతి రంగులో ఒక జ్ఞాపకం ఉంటుంది.
ఈ కళలు తరచుగా పూర్వీకుల నుండి మౌఖికంగా లేదా కుటుంబ సంప్రదాయాల ద్వారా సంక్రమించాయి. ఆధునిక ప్రపంచంలో ఈ సంప్రదాయాలు కనుమరుగవుతున్న ప్రమాదం ఉన్నప్పటికీ, ఇటువంటి ఉత్సవాలు వాటికి కొత్త జీవం పోస్తున్నాయి. కళాకారులకు జాతీయ వేదికను అందించడం ద్వారా ప్రభుత్వం, భాగస్వామ్య సంస్థలు ఒక ముఖ్యమైన సాంస్కృతిక బాధ్యతను నిర్వర్తించాయి.
మహిళలు: సంప్రదాయాల స్తంభాలు
గిరిజన సమాజాల్లో మహిళలు కళా సంప్రదాయాల ప్రధాన సంరక్షకులు. పండుగల సమయంలో గోడలపై చిత్రాలు గీయడం, ఇంటి అలంకరణ చేయడం, ఆచార చిహ్నాలను రూపొందించడం ఇవన్నీ మహిళల చేతుల్లోనే కొనసాగుతున్నాయి. వారి కళ కేవలం అందం కోసం కాదు, అది గుర్తింపు కోసం, ఆత్మగౌరవం కోసం.
ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026 లో పాల్గొన్న మహిళా కళాకారులు ఈ వాస్తవాన్ని మరింత బలంగా చూపించారు. వారి కృతులు పాత సంప్రదాయాలను మాత్రమే కాదు, ఆధునిక కళా వేదికల అవసరాలకు అనుగుణంగా మార్పు చెందుతున్న సృజనాత్మకతను కూడా సూచించాయి. ఇది మహిళల సామర్థ్యాన్ని, వారి ఆలోచనా శక్తిని, నాయకత్వాన్ని స్పష్టంగా తెలియజేసింది.
ప్రకృతి, కళ మధ్య అనుబంధం
గిరిజన కళలో ప్రకృతి ఒక ప్రధాన అంశం. అడవులు, పర్వతాలు, నదులు, జంతువులు, ఇవి కేవలం దృశ్యాలు కాదు. అవి ఆధ్యాత్మిక ప్రతీకలు. “జల, జమీన్, జంగల్” అనే తత్వం గిరిజన జీవనంలో మూల సూత్రం. నీరు లేకుండా జీవనం లేదు, భూమి లేకుండా ఆహారం లేదు, అడవి లేకుండా సమతుల్యత లేదు. ఈ తత్వాన్ని కళాకారులు తమ చిత్రాల్లో ప్రతిబింబిస్తున్నారు. ఉదాహరణకు, వార్లీ చిత్రాల్లో సామూహిక నృత్యాలు, పంట కోత దృశ్యాలు కనిపిస్తాయి. గోండ్ చిత్రాల్లో అడవి జీవితం, పక్షులు, జంతువులు, పౌరాణిక కథలు కనిపిస్తాయి. ఈ కళలు ప్రకృతితో మానవుల సహజ అనుబంధాన్ని గుర్తుచేస్తాయి.
ఈ దృక్పథం ఆధునిక సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తుంది. అభివృద్ధి ప్రకృతిని ధ్వంసం చేయకూడదు. దానితో సమన్వయం సాధించాలి.
ఆర్థిక సాధికారతకు కొత్త మార్గాలు
సాంస్కృతిక ఉత్సవాలు కేవలం కళను ప్రదర్శించడమే కాదు. అవి ఆర్థిక అవకాశాలను కూడా సృష్టించాలి. ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026 ఈ దిశగా పనిచేసింది. కళాకారులు నేరుగా సేకరేతలు (కళాఖండాలు, వస్తువులు లేదా విలువైన అంశాలను సేకరించే వ్యక్తులు ) గ్యాలరీలు, సంస్థలు, డిజైన్ రంగంతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇది మధ్యవర్తులపై ఆధారాన్ని తగ్గించి, న్యాయమైన ఆదాయాన్ని అందించింది.
గిరిజన కళను మార్కెట్‌తో అనుసంధానం చేయడం ద్వారా అది జీవనోపాధిగా మారుతుంది. ఇది యువతను సంప్రదాయ కళ వైపు ఆకర్షిస్తుంది. లేకపోతే, ఆధునిక ఉపాధి అవకాశాల దృష్ట్యా ఈ కళలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, ఇటువంటి వేదికలు సాంస్కృతిక పరిరక్షణతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా అందిస్తున్నాయి.
తరాల మధ్య వారసత్వ బంధం
గిరిజన కళలో ఒక ముఖ్యమైన అంశం. తరతరాల సంక్రమణ. కుటుంబంలోనే శిక్షణ ప్రారంభమవుతుంది. పిల్లలు చిన్న వయస్సులోనే గోడలపై చిత్రాలు గీయడం నేర్చుకుంటారు. ఇది విద్యా వ్యవస్థకు భిన్నమైన, కానీ సమానంగా విలువైన అభ్యాసం.
ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026లో యువ కళాకారుల పాల్గొనడం ఒక సానుకూల సూచన. కొత్త తరం కళాకారులు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, డిజిటల్ వేదికలు, ఆధునిక ప్రదర్శన విధానాలను ఉపయోగిస్తున్నారు. ఇది సంప్రదాయానికి నూతన రూపాన్ని ఇస్తోంది.
మహిళా నాయకత్వం, సామూహిక సృష్టి
ప్రాజెక్ట్ ఖుమ్ వంటి కార్యక్రమాలు మహిళల సృజనాత్మక శక్తిని ప్రతిబింబించాయి. సమిష్టి సృష్టి ద్వారా వారు కళలో సహకార భావనను చూపించారు. ఇది వ్యక్తిగత ప్రతిభ మాత్రమే కాదు. సామూహిక శక్తి యొక్క ప్రతీక. మహిళలు సాంస్కృతిక నాయకత్వంలో ముందుండటం సమాజ అభివృద్ధికి కీలకం. కళ ద్వారా వారు తమ స్వరం వినిపిస్తున్నారు. ఇది సమాజంలో సమానత్వ భావనను బలపరుస్తుంది.
సమాజం, విధానాలు, భవిష్యత్తు
ప్రభుత్వ పథకాలు- ప్రధానమంత్రి జనజాతి గిరిజన అభ్యున్నతి మిషన్, ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్(గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం) ఏకలవ్య నమూనా రెసిడెన్షియల్ పాఠశాలలు విస్తరణ, భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సంస్థ ఇచ్చే మార్కెట్ మద్దతు గిరిజన అభివృద్ధికి ఒక విధాన మద్దతు అందిస్తున్నాయి. కానీ విధానాలు మాత్రమే సరిపోవు. వాటి అమలు సమర్థవంతంగా ఉండాలి.
కళాకారులకు శిక్షణ, మార్కెట్ సమాచారం, డిజిటల్ ప్రమోషన్ వంటి అంశాలు కూడా అవసరం. ఈ దిశగా సమగ్ర వ్యూహం రూపొందించాలి. సాంస్కృతిక కార్యక్రమాలు కేవలం వార్షిక వేడుకలుగా కాకుండా, నిరంతర వేదికలుగా మారాలి.
సాంస్కృతిక గౌరవం, జాతీయ గుర్తింపు
గిరిజన కళలకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. ఇది గిరిజన సమాజాల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వారి కళలను “గ్రామీణ” లేదా “లోకల్” అని కాకుండా, “జాతీయ వారసత్వం”గా గుర్తించడం అవసరం.ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026 ఈ దిశగా ఒక కీలక అడుగు. ఇది గిరిజన కళను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చింది. ఇది సాంస్కృతిక సమానత్వానికి దోహదపడుతుంది.
బ్రష్ స్ట్రోక్‌లతో భవిష్యత్తు నిర్మాణం
భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆ లక్ష్యంలో ఆర్థిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, సాంస్కృతిక పరిరక్షణ కూడా అంతే ముఖ్యమైనది. మహిళా కళాకారులు తమ బ్రష్ స్ట్రోక్‌లతో కేవలం చిత్రాలు గీయడం లేదు. వారు ఒక చరిత్రను రాస్తున్నారు. వారు ఒక సమాజాన్ని ప్రతిబింబిస్తున్నారు. వారు భవిష్యత్తుకు మార్గం చూపుతున్నారు.
ట్రైబ్స్ ఆర్ట్ ఫెస్ట్ 2026 ఈ సత్యాన్ని స్పష్టంగా నిరూపించింది. అభివృద్ధి, వారసత్వం పరస్పర విరుద్ధాలు కావు. అవి కలిసి నడవగలవు. మహిళల చేతుల్లో సంస్కృతి మరింత వికసిస్తుంది. వారి కళలు భారతీయ గుర్తింపుకు కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి.
ఈ ఉత్సవం ఒక సందేశాన్ని అందిస్తోంది. మన మూలాలను మరచిపోకుండా, వాటిని గౌరవిస్తూ ముందుకు సాగాలి. అదే నిజమైన అభివృద్ధి. అదే నిజమైన వికసిత్ భారత్.
