
మహిళల కోసం ప్రత్యేక ఎంఎస్‌ఎంఈ పార్కులు: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆర్థికంగా సాధికారత కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఆదివారం ప్రకటించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంలో మహిళలను ముఖ్య భాగస్వాములుగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణలో మహిళల పట్ల సామాజిక దృక్పథంలో మార్పు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు 45.2 శాతం కంటే చాలా ఎక్కువని తెలిపారు. 2017-18లో 22 శాతం ఉన్న మహిళల పనిలో భాగస్వామ్యం, 2023-24 నాటికి 40.3 శాతానికి పెరిగిందని ఆయన తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో వీ-హబ్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని, ఈ సంస్థ ద్వారా గ్లోబల్ స్థాయిలో పోటీపడే మహిళా సంస్థలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం మహిళలకు నైపుణ్య శిక్షణ, సాంకేతికత, ఆర్థిక సహాయం, మార్కెట్లను ఒకే వ్యవస్థ కింద అందించడానికి కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.
ఎంఎస్‌ఎంఈ పార్క్ అంటే ఏమిటి?
ఎంఎస్‌ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అని అర్థం. ఎంఎస్‌ఎంఈ పార్క్ అంటే ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ ఒకేచోట స్థాపించడానికి వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతం. ఈ పార్కుల్లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి/ప్లాట్లు లేదా రెడీమేడ్ షెడ్‌లు (లీజు పద్ధతిలో కూడా), రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సరఫరా, సాధారణ సౌకర్య కేంద్రాలు వంటి మౌలిక వసతులను ప్రభుత్వమే సిద్ధం చేస్తుంది.
ఈ ప్రత్యేక పార్కుల ఏర్పాటు వల్ల మహిళా పారిశ్రామికవేత్తలకు, స్థానిక ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. అన్ని వసతులు ఒకేచోట లభిస్తాయి కాబట్టి, కొత్త పరిశ్రమను స్థాపించడం, లైసెన్సులు పొందడం సులభం అవుతుంది. ఎంఎస్‌ఎంఈలుగా రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రభుత్వ రాయితీలు, తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు, పన్ను మినహాయింపులు, విద్యుత్ రాయితీలు వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
ఈ పార్కుల్లో వేలాది చిన్న యూనిట్లు ఏర్పాటవుతాయి. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు స్థానికంగానే ఉపాధి దొరుకుతుంది. ఈ పార్కుల్లో నిరంతరం నైపుణ్య శిక్షణ అవకాశాలు ఉంటాయి, దీనివల్ల కార్మికుల నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఉపాధి అవకాశాలు పెరగడంతో, ప్రజల ఆదాయం పెరుగుతుంది. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దేశంలో ఎంఎస్‌ఎంఈ రంగం జీడీపీలో దాదాపు 30 శాతం వాటా కలిగి ఉంది, కోట్లాది మందికి ఉద్యోగాలను కల్పిస్తోంది. మహిళలు కేవలం ఉద్యోగులుగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ పార్కులు అవకాశం కల్పిస్తాయి.
