Let's talk: editor@tmv.in
మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఘనంగా పూర్తి

మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఘనంగా పూర్తి

Koripelli Aditya
2 డిసెంబర్, 2025

రెండో మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025ను ఢాకాలో అద్భుతంగా నిర్వహించినందుకు బంగ్లాదేశ్ కబడ్డీ ఫెడరేషన్ గర్వంగా ఉన్నాం అని తెలియజేసింది. టోర్నీ విజయవంతమైన నిర్వహణపై ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ఎం నవాజ్ షొహాగ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) విడుదల చేసిన ప్రకటనలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘ప్రణాళిక, జట్టుకృషి, సమన్వయం లేకుండా ప్రపంచ స్థాయి ఈవెంట్ నిర్వహణ సాధ్యం కాదని ఈ టోర్నీ మరోసారి నిరూపించింది. లాజిస్టిక్స్, ఆటగాళ్ల సంక్షేమం, అంతర్జాతీయ భాగస్వాములతో సమన్వయం సక్రమంగా జరిగితే, అంతా సాఫీగా సాగుతుంది. అలాగే మహిళల కబడ్డీ ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా పుంజుకుంటోందో కళ్లారా చూశాం. క్రీడాకారులతోపాటు అధికారుల సామర్థ్యాన్ని కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పెంచుకోవాలని గుర్తుచేసింది’ అని షొహాగ్ అన్నారు.

కబడ్డీని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలన్నదానిపైనా ఆయన సూచనలు చేశారు. ‘ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలంటే, క్రమం తప్పకుండా అంతర్జాతీయ టోర్నీలు, గ్రాస్‌రూట్ స్థాయిలో బలోపేతం అవసరం. మహిళల పాల్గొనడాన్ని పెంచాలి, యువత కోసం పోటీలు పెంచాలి, అంతర్జాతీయ ఫెడరేషన్లతో సన్నిహితంగా పనిచేయాలి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, మంచి కథనాలు, ఆధునిక ఈవెంట్ ప్రెజెంటేషన్‌తో కబడ్డీని ఇంకా ఎక్కువ మందికి చేర్చాలి’ అని షొహాగ్ పేర్కొన్నారు.

ఈ వరల్డ్ కప్ వల్ల బంగ్లాదేశ్‌లో కబడ్డీ పాపులారిటీ గణనీయంగా పెరిగిందని ఆయన ఒప్పుకున్నారు. ‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన జట్లతో ఉత్సాహం మామూలుగా లేదు. మీడియా సహకారంతో కొత్త ప్రేక్షకులను చేరుకున్నాం. ముఖ్యంగా యువతులు, బాలికలు కబడ్డీపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇది మా స్థానిక కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడానికి ప్రేరణగా నిలిచింది’ అని షొహాగ్ తెలిపారు.

చివరగా ఫైనల్ జట్లను అభినందించిన షొహాగ్, ‘భారత్‌ను విజయం సాధించినందుకు బంగ్లాదేశ్ కబడ్డీ ఫెడరేషన్ అభినందిస్తోంది. టోర్నీ అంతా నైపుణ్యం, స్థిరత్వం, ఆత్మవిశ్వాసంతో ఆడిన భారత్ అద్భుతంగా రాణించింది. చైనీస్ తైపీ కూడా అద్భుత ప్రదర్శన చేసింది. ఈ రెండు జట్లూ మహిళల కబడ్డీ స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయి. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. 2025 మహిళల కబడ్డీ వరల్డ్ కప్, బంగ్లాదేశ్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఈ ఆటకు బలమైన ఊపిరి పోసింది.