
మహిళల ఆర్థిక భద్రత – స్వతంత్రతతో స్త్రీ శక్తి
కాలం మారింది, సమాజం మారింది, ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు “మగవాడు సంపాదిస్తాడు, ఆడవారు ఇంటిని చూసుకుంటారు ” అన్న భావన సాధారణం. కానీ నేటి స్త్రీ ఇంటిని మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా నడిపించే స్థాయికి ఎదిగింది.ఉదాహరణకి నిర్మలాసీతారామన్ చూడండి దేశ ఆర్ధిక నిర్ణయాలలో ఆమే పాత్ర ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటికీ చాలా మంది మహిళలు ఆర్థిక స్వాతంత్రo విషయంలో వెనుకబడి ఉన్నారు.
ఆడవాళ్లకు ఆర్థిక భద్రత అనేది కేవలం డబ్బు విషయం కాదు. అది గౌరవం, ధైర్యం, స్వీయ నిర్ణయాధికారం యొక్క ప్రతీక.
ఇప్పటి ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ, విద్య, ఆర్థిక వ్యవస్థలలో మహిళల పాత్ర పెరుగుతోంది. కానీ ఇంకా చాలా మంది మహిళలు, ముఖ్యంగా పల్లెల్లో మరియు మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ఒక స్త్రీ ఆర్థికంగా బలపడితే ఆమె కుటుంబం, గ్రామం, సమాజం అంతా బలపడతాయి. అందుకే మహిళల ఆర్థిక భద్రత అనేది కేవలం వ్యక్తిగత ప్రయోజనం కాదు, జాతీయ అభివృద్ధికి మూలాధారం.
ఆర్థిక భద్రత అంటే ఏమిటి?
ఆర్థిక భద్రత అంటే, అవసరమైనప్పుడు ఎవరిపైన ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోగలగడం, అత్యవసర పరిస్థితుల్లో తనకు తానే నిలబడగలగడం, భవిష్యత్తుకై పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు చేయగలగడం.
అంటే స్త్రీ చేతిలో డబ్బు ఉండడం కేవలం సౌకర్యం కాదు . ఆర్దిక స్వేచ్ఛకు సంకేతం.
ఎందుకు మహిళలకు ఇది అత్యవసరం?
అనిశ్చిత ప్రపంచంలో భరోసా: జీవితంలో ఏమి ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు.
వివాహం, ఉద్యోగం, కుటుంబ పరిస్థితులు మారవచ్చు. కానీ ఆర్థికంగా స్వతంత్రురాలైన మహిళ ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలదు.కుటుంబంలో ఆపద వచ్చినప్పుడు ఆదాయం ఉన్న స్త్రీ ఎవరిపైన ఆధారపడకుండా సమస్యను ఎదుర్కోగలదు.
పిల్లల భవిష్యత్తు రక్షణ: తల్లి ఆర్థికంగా బలంగా ఉంటే పిల్లల విద్య, ఆరోగ్యం, భద్రత అన్నీ స్థిరంగా ఉంటాయి.
సమాజ గౌరవం: సంపాదించే మహిళ సమాజంలో గౌరవం పొందుతుంది. ఆమె మాటకు విలువ పెరుగుతుంది.
తన నిర్ణయాలపై హక్కు: ఆర్థిక స్వాతంత్రo ఉన్నప్పుడు స్త్రీ తన జీవిత నిర్ణయాలను తానే తీసుకోగలదు.
సమాజ స్థిరత్వానికి మహిళే ఆధారం: మహిళల ఆర్థిక బలం సమాజ స్థిరత్వానికి మూలం.
వారి ఆదాయం కుటుంబానికి ఆహారం, విద్య, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
భవిష్యత్తు భరోసా: పొదుపు, పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తు భద్రత లభిస్తుంది.
ఆర్దిక భద్రత ఎలా సాద్యం
విద్య - మొదటి పెట్టుబడి: విద్యే స్త్రీ జీవితంలో బలమైన ఆయుధం. చదువు ఉన్న మహిళకు ఉద్యోగం, వ్యాపారం, లేదా స్వయం ఉపాధి ఏదైనా సాధ్యమవుతుంది.
“చదువు ఉన్న ఆడవారు సమస్యలకు ఎప్పుడూ తలవంచరు”
పొదుపు అలవాటు: ప్రతి నెల కొంత మొత్తాన్ని తప్పనిసరిగా పొదుపు చేయాలి. చిన్న మొత్తం అయినా చిట్టీ, బ్యాంక్ ఆర్‌డీ, లేదా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి.
“చిన్న పొదుపు – పెద్ద భవిష్యత్తు” అనే నానుడి గుర్తుంచుకోవాలి.
బ్యాంకింగ్ పరిజ్ఞానం: డిజిటల్ యుగంలో మహిళలు యుపిఐ, నెట్‌బ్యాంకింగ్, పాస్‌బుక్ నిర్వహణ వంటి విషయాలు నేర్చుకోవాలి. ఇవి భద్రత, స్వీయనిర్వహణ రెండింటినీ ఇస్తాయి.
ఇన్వెస్ట్‌మెంట్ అవగాహన: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, గోల్డ్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులు దీర్ఘకాలిక లాభం ఇస్తాయి.వాటిపై అవగాహన పెంచుకోవాలి.
ఇన్స్యూరెన్స్ భద్రత: హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి. ఆపదలో ఇవే మనకు ఆర్థిక కవచంగా మారతాయి.
స్వయం ఉపాధి: చిన్న వ్యాపారం అయినా సొంత ఆదాయ వనరులు ఉండడం ఎంతో ముఖ్యం. ఉదా: టైలరింగ్, బ్యూటీ పార్లర్, హోమ్ బేకింగ్, ఆన్‌లైన్ బిజినెస్ మొదలైనవి.
భారతదేశంలో మహిళలకు ఉన్న ఆర్థిక అవకాశాలు
భారతదేశం లో గత దశాబ్దంలో మహిళల ఆర్థిక భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. విద్య, ఐటీ, బ్యాంకింగ్, స్వయం ఉపాధి, హస్తకళలు వంటి రంగాల్లో మహిళలు ప్రతిభ చాటుతున్నారు.
ఉద్యోగ అవకాశాలు: నగర ప్రాంతాల్లో విద్యావంతులైన మహిళలు ఐటీ, బ్యాంకింగ్, ప్రభుత్వ, బోధన, ఆరోగ్య రంగాల్లో పనిచేస్తున్నారు. సమాన వేతన చట్టాలు, మాతృత్వ రక్షణ చట్టాలు వంటి చట్టాలు మహిళల ఉద్యోగ భద్రతను పెంచుతున్నాయి.
స్వయం ఉపాధి : మహిళలు స్వంతంగా వ్యాపారం ప్రారంభించే ధైర్యం పెరుగుతోంది. హోమ్ బేకరీలు, బ్యూటీ పార్లర్లు, హ్యాండ్‌క్రాఫ్ట్ యూనిట్లు, ఆన్‌లైన్ మార్కెటింగ్ వంటి రంగాల్లో వేలాది మంది మహిళలు ఆర్థికంగా నిలబడుతున్నారు.
ప్రభుత్వ పథకాల సహాయం: భారత ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది.
• స్టాండప్ ఇండియా స్కీమ్ - మహిళా వ్యాపారులకు రూ. 10 లక్షల వరకు రుణాలు
• మహిళా ఎ-హాట్ - ఆన్‌లైన్ మార్కెట్ ప్లాట్‌ఫాం
• ముద్రా లోన్స్ – చిన్న వ్యాపారాలకు తక్కువ వడ్డీ రుణాలు
• సుకన్య సమృద్ధి యోజన – బాలికల భవిష్యత్తు కోసం పొదుపు పథకం
• ఉజ్వల యోజన – వంటగ్యాస్ ద్వారా ఆరోగ్య, ఆర్థిక భద్రత. ఈ పథకాలు ఉపయోగించుకున్న మహిళలు తమ జీవితాలను మార్చుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు - మహిళల ఆర్థిక బలానికి మార్గం. ఈ పథకాలను ఉపయోగించి మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారాలి.
డబ్బు కాదు - గౌరవం, ఆర్థిక భద్రత: ఆర్థిక భద్రత ఉన్న స్త్రీకి కేవలం డబ్బు కాదు. గౌరవం, ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తాయి.
స్వతంత్రంగా నిలబడగలిగిన మహిళే నిజమైన శక్తిమంతురాలు.
పల్లెల్లో మహిళల ఆర్థిక పరిస్థితి
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా వ్యవసాయం, పశుసంవర్ధక, హస్తకళలు, స్వయం సహాయక సంఘాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వారు ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములు అయినా, గుర్తింపు మాత్రం తక్కువగా ఉంటుంది.
స్వయం సహాయక సంఘాలు: ఇది గ్రామీణ మహిళల జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన వ్యవస్థ. 10–20 మంది మహిళలు కలిసి పొదుపు చేసి, చిన్న రుణాలు తీసుకొని వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఇందువల్ల వారికి స్వంత ఆదాయం, ఆర్థిక అవగాహన సామాజిక గౌరవం పెరుగుతున్నాయి.
“డ్వాక్రా గ్రూపులు” మహిళలకు ఉపాధి, పొదుపు, వ్యాపార నైపుణ్యం నేర్పుతున్నాయి.
హస్తకళల రంగం: చేనేత, చెక్క బొమ్మల తయారీ, గాజులు, దుప్పట్లు, అద్దకాలు, అల్లికలు ఈ రంగాల్లో గ్రామీణ మహిళలు పెద్ద స్థాయిలో భాగస్వామ్యం చేస్తున్నారు. అయితే వారికి మార్కెటింగ్ అసౌకర్యాలు, ధర స్థిరత్వం వంటి సమస్యలు ఉన్నాయి.
ప్రభుత్వం “హస్తకళ హాట్స్”, “రూరల్ మార్ట్‌లు” ఏర్పాటు చేయడం ఈ దిశగా మంచి అడుగు.
పొదుపు, పెట్టుబడి – భవిష్యత్తు బలం*
ప్రతి మహిళ తన ఆదాయంలో కనీసం 10 - 20% మొత్తాన్ని పొదుపు చేయాలి.
• పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ) – దీర్ఘకాలిక భద్రత
• గోల్డ్ బాండ్స్ – బంగారంపై సురక్షిత పెట్టుబడి
• మ్యూచువల్ ఫండ్స్ – స్థిరమైన పెరుగుదల
• ఇన్స్యూరెన్స్ పాలసీలు – ఆరోగ్య, జీవ భద్రత. ఇవన్నీ ఆర్థిక భవిష్యత్తును బలపరుస్తాయి.
ఆర్థిక అజ్ఞానం – పెద్ద అడ్డంకి
చాలా మంది మహిళలు ఇప్పటికీ డబ్బు వ్యవహారాలపై మాట్లాడటానికి కూడా వెనుకడతారు.
“నా భర్త చూస్తాడు”, “నా తండ్రి చూసుకుంటాడు” అని అనడం వలన వారు డబ్బు వ్యవస్థపై అవగాహన కోల్పోతున్నారు.
ఇది వేరొకరిపై ఆధారపడే స్వభావంను పెంచుతుంది. ప్రతి మహిళ తన ఖర్చులు, ఆదాయం, రుణాలు, పొదుపులు అన్నింటిపై స్వయంగా అవగాహన కలిగి ఉండాలి.
కుటుంబం, సమాజం చేయాల్సినది
మహిళల ఆర్థిక స్వాతంత్రo కోసం కుటుంబం ప్రోత్సహించాలి. ఆమె నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి. ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలన్న ఉత్సాహాన్ని అడ్డుకోకూడదు.పిల్లలకు చిన్నప్పటి నుంచే పొదుపు విలువ నేర్పించాలి.
ఆర్థికంగా బలమైన స్త్రీ – బలమైన భారత్
“మహిళల ఆర్థిక స్వాతంత్రo కేవలం వారి జీవితాన్ని కాదు, దేశ భవిష్యత్తును కూడా మార్చుతుంది.” ఆర్థిక భద్రత ఉన్న స్త్రీ..
• గౌరవంగా జీవిస్తుంది,
• ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటుంది,
• సమాజాన్ని ప్రేరేపిస్తుంది.
భారతదేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే – ప్రతి స్త్రీ ఆర్థికంగా స్వతంత్రురాలిగా మారాలి.
ఆమె చేతిలోని రూపాయి – ఆమె భవిష్యత్తు రూపురేఖ.
“ఆమె చేతిలో ఉన్న రూపాయి, ఆమె గుండెల్లో ఉన్న ధైర్యం - రెండూ సమాజానికి వెలుగులు.”
ఆర్థిక భద్రతతోనే సమాజ భద్రత: స్త్రీ ఆర్థికంగా బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది. కాబట్టి ప్రతి మహిళా ఈ రోజు నుంచే పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం, ఆర్థిక అవగాహన పెంపొందించడం ప్రారంభించాలి.
ఆర్థిక స్వాతంత్రo స్త్రీకి విలాసం కాదు – జీవితం నిలబెట్టే అవసరం.
