
మహిళల ఆరోగ్యంపై రాజీ పడొద్దు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్' కార్యక్రమం అమలులో ఎలాంటి అలసత్వం వహించవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8న ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమ పురోగతిపై బుధవారం ఆయన సెక్రటేరియట్ నుంచి ఆరోగ్యశాఖ, సెర్ప్ అధికారులతో ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇది స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలైన సుమారు 46 లక్షల మహిళలకు, 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్నారు.ఈ కార్యక్రమం దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనివిధంగా రూపొందించబడింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్ని అధికారులకు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాన్ని అమలు చేయాలని, మహిళలను పరీక్షల కోసం హాస్పిటల్స్‌కు తరలించడానికి, పరీక్ష అనంతరం తిరిగి సురక్షితంగా ఇంటికి పంపడానికి వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు. హాస్పిటల్స్‌లో ఎక్కువ వేచిచేయకుండా, సౌకర్యవంతంగా పరీక్షలు జరగాలని, తగినంత డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉంచాలని, కుర్చీలు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించమని పేర్కొన్నారు. స్క్రీనింగ్‌లో ఏవైనా సమస్యలు గుర్తించినప్పుడు వెంటనే చికిత్స ప్రారంభించమని మంత్రి ఆదేశించారు.
పరీక్షల సర్వీస్ ప్రాసెస్‌లో రక్త నమూనాల సేకరణ నుంచి ల్యాబ్ వరకు అన్ని దశల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని, కోల్డ్ చైన్ ప్రోటోకాల్స్ పాటిస్తూ సాంపిల్స్ దెబ్బతినకుండా చూడమని, డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించమని మంత్రి హెచ్చరించారు. డీఎంహెచ్‌వోలు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రథమ దశలో ప్రతి జిల్లాలోని 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అమలులో ఉంది. మౌలిక సదుపాయాలు, సిబ్బంది లభ్యత ఆధారంగా రెండో దశలో మిగతా మండలాలకు విస్తరింపజేస్తారు. మహిళలను సమీపంలోని పీహెచ్‌సీలకు సెర్ప్ ఆధ్వర్యంలో తరలించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రిజిస్ట్రేషన్, జనరల్ చెకప్, బ్లడ్ శాంపిల్స్ కలెక్షన్ నిర్వహిస్తారు. శాంపిల్స్ తిరిగి టీ-డయాగ్నస్టిక్స్‌కు తరలించి పరీక్షలు చేయబడతాయి.
ప్రతి మహిళకు (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గుర్తింపు) ఏబీఎచ్ఏ ఐడి ద్వారా క్యూఆర్ కోడ్ అనుసంధానిత డిజిటల్ హెల్త్ రికార్డులను సృష్టిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా కాగితాలతో పనిలేకుండానే వైద్య సేవలు పొందవచ్చు. రిపోర్టులు నేరుగా ఫోన్‌కు ఎస్ఎంఎస్ లేదా 'ఈ-ఆరోగ్యం' యాప్ ద్వారా అందుతాయి.
ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, హెల్త్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
