Let's talk: editor@tmv.in
మహిళల ఆధ్వర్యంలో సుపరిపాలన: సీఎం రేఖాగుప్తా

మహిళల ఆధ్వర్యంలో సుపరిపాలన: సీఎం రేఖాగుప్తా

Pinjari Chand
9 ఫిబ్రవరి, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో మహిళల ఆధ్వర్యంలో సుపరిపాలన సాధ్యమవుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటి వరకు 4,000 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌తో కలిసి 4,000వ ఈవీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ఢిల్లీ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సుల ఫ్లీట్‌ కలిగిన నగరంగా నిలిచింది. ఈరోజు మరో 500 బస్సులను ప్రభుత్వం ప్రారంభించింది.

ప్రధానమంత్రి మోడీ నాయకత్వానికి ఇదే అద్భుతం. మహిళా డ్రైవర్‌, మహిళా కార్యదర్శి, మహిళా ముఖ్యమంత్రి ఇలా మహిళల ఆధ్వర్యంలో దేశంలో అభివృద్ధి సాధ్యమైంది. ఢిల్లీ ప్రజల నమ్మకం, ఆశీర్వాదాల వల్ల ఫిబ్రవరి 8న 4,000 ఈవీ బస్సులను ప్రజలకు అంకితం చేయగలిగాం. గత 365 రోజులుగా మా ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తోందని సీఎం రేఖా గుప్తా అన్నారు. 4,000 ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రారంభంతో ఢిల్లీ నగరంలో కార్బన్‌ ఉద్గారాలు గణనీయంగా తగ్గడంతో పాటు, ప్రజారవాణా వ్యవస్థ ఆధునికీకరణకు దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పంకజ్‌ కుమార్‌ సింగ్‌, పీడబ్ల్యూడీ మంత్రి పర్వేశ్‌ వర్మ కూడా పాల్గొన్నారు. అదే సమయంలో ఢిల్లీ–పానిపట్‌ బస్సు సేవలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పంకజ్‌ సింగ్‌ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం హామీలను అమలు చేస్తోందని తెలిపారు. మరో 500 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టడమే కాకుండా, ఢిల్లీ–పానిపట్‌ మధ్య రవాణా అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.

ఆప్ ప్రభుత్వం పై విమర్శలు

సభను ఉద్దేశించి సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలుగా ఢిల్లీ అభివృద్ధిలో వెనుకంజలో ఉండిందని విమర్శించారు. నీరు, మురుగునీరు, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు అందకుండా పోయాయి. కానీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించి, తాము ఎవరికైనా అధికారం ఇవ్వగలమన్నట్లే, అవసరమైతే అదే అధికారాన్ని తీసేసే శక్తి తమకుందని నిరూపించారని ఆమె అన్నారు. మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ఆమె విమర్శలు చేశారు. నన్ను ఓడించాలంటే మళ్లీ పుట్టాలి అని ఆయన అన్నారు. కానీ ఈ జీవితంలోనే, ఈ రామలీలా మైదానంలోనే ఢిల్లీ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని మార్చేశారని వ్యాఖ్యానించారు.