
మహిళల అంధుల క్రికెట్ జట్టుకు పవన్ కళ్యాణ్ ఘన సన్మానం
ప్రపంచ కప్ విజేతగా నిలిచి దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
జట్టులోని క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో ఉప ముఖ్యమంత్రి సుమారు గంటపాటు సమావేశమై, వారి క్రీడా ప్రయాణం, పట్టుదల ఎంతో ప్రశంసనీయమైనది ముఖ్యంగా, దృష్టి లోపం ఉన్నప్పటికీ లక్ష్యాన్ని ఛేదించడంలో వారు చూపించిన ధైర్యాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
ప్రోత్సాహకాల జల్లు
సత్కార కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించి, చెక్కులను అందజేశారు. జట్టులోని ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున చెక్కులు. శిక్షకులు, సహాయక సిబ్బందికి రూ.2 లక్షల చొప్పున ప్రోత్సాహక రుసుములు మంజూరు చేశారు. వీటితోపాటు విజేతలకు ప్రత్యేక ఆదరాభిమానాలను చాటుతూ పట్టు చీరలు, శాలువాలు, జ్ఞాపికలు, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ ప్యాకెట్లను బహుమతులుగా అందించి సత్కరించారు.
మీ పట్టుదల దేశానికి గర్వకారణం
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మహిళా అంధ క్రికెటర్లు ప్రపంచ కప్ సాధించడం దేశానికి గర్వకారణం, మీ లోపాన్ని మీ లక్ష్యసాధనకు ఆయుదంగా మలుచుకొని మీరు చూపించిన పట్టుదల ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుంది అని ప్రశంసించారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను స్వయంగా కోరుతానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యం ఇస్తుందని, జట్టు సభ్యులు ప్రస్తావించిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.
స్థానిక క్రీడాకారిణులకు ప్రత్యేక గౌరవం
ప్రపంచ కప్ విజేత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపిక (కెప్టెన్) పాంగి కరుణా కుమారి ఉండటం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ దీపిక తన స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా, హేమావతి పంచాయతీలోని తంబలహట్టి తండాకు రహదారి సౌకర్యం కల్పించాలని అభ్యర్థించింది , ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కరుణా కుమారి సైతం తమ గ్రామంలో ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై పవన్ వెంటనే స్పందించి, ఆయా శాఖ అధికారులకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
