
మహిళలు, శిశువుల సంక్షేమం కోసం 'పంఖుడి' డిజిటల్ పోర్టల్ ప్రారంభం
భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళలు పిల్లల సంక్షేమం, రక్షణ, సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది. ఈ నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 'పంఖుడి' అనే సమగ్ర కార్పొరేట్ సామాజిక బాధ్యత భాగస్వామ్య సదుపాయాల డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించింది. మహిళలు, శిశు అభివృద్ధి కోసం ఉద్దేశించిన కార్యక్రమాలలో సమన్వయం, పారదర్శకత, నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశ్యం.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి గురువారం లాంఛనంగా పంఖుడి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్, కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్ పాల్గొన్నారు.
పంఖుడి పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు:
జన్ భాగీదారీ (ప్రజల భాగస్వామ్యం):
సాంకేతికత ప్రభుత్వం, పౌరుల మధ్య వారధిగా పనిచేస్తుందన్న ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా ఈ పోర్టల్ రూపొందించబడింది. దేశంలోని వ్యక్తులు, ప్రవాస భారతీయులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలను ఒకే వేదికపైకి (సింగిల్-విండో ప్లాట్‌ఫారమ్) తీసుకువస్తుంది.
ఇందులో ప్రధాన రంగాలుగా పోషణ, ఆరోగ్యం, ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య, శిశు సంక్షేమం, రక్షణ, పునరావాసం మహిళల భద్రత వంటి రంగాలలో సహకారాన్ని ఈ పోర్టల్ సులభతరం చేస్తుంది.
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన మిషన్ సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి వంటి పథకాల అమలును ఇది మరింత వేగవంతం చేస్తుంది.
పోర్టల్ ప్రత్యేకతలు, ప్రయోజనాలు
పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేస్తుంది. విరాళాలు, సహకారం అందించే వారు పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, తమ ప్రతిపాదనలను సమర్పించవచ్చు, వాటి స్థితిగతులను ట్రాక్ చేయవచ్చు. నగదు రహిత లావాదేవీలు అమలులోకి వస్తాయి. అనగా ఆర్థిక పారదర్శకతను పెంచడానికి, అన్ని రకాల విరాళాలను కేవలం డిజిటల్ రూపంలోనే స్వీకరిస్తారు.
మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఈ పోర్టల్ ద్వారా వచ్చే సహకారం దేశంలోని 14 లక్షలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు, 5,000 శిశు సంరక్షణ సంస్థలు, సుమారు 800 వన్ స్టాప్ సెంటర్లు, 500 కంటే ఎక్కువ సఖి నివాస్, 400 కంటే ఎక్కువ శక్తి సదన్‌ల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
ఈ 'పంఖుడి' పోర్టల్ మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం డిజిటల్ పరిష్కారాలను ఉపయోగించుకోవడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది, ఇది కోట్లాది మంది పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
