
మహిళలు తమలోని శక్తిని గుర్తించి సమాజంలో ముందుకు రావాలి:ఎమ్మెల్యే గళ్ళా మాధవి
మహిళలు తమలోని అంతర్లీన సామర్థ్యాన్ని గుర్తించి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొరిటెపాడు మాజేటి రామ్ కళ్యాణ మండపంలో ఎన్డీయే కూటమి మహిళా నేతల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మహిళలకు అత్యున్నత స్థానం ఉందన్నారు. కుటుంబానికి మొదటి గురువుగా ధైర్యం నింపే వ్యక్తిగా ప్రేమను పంచే శక్తిగా మహిళ నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారని అయితే మహిళల సామర్థ్యాన్ని ఇతరులు గుర్తించాలని ఎదురు చూడకుండా ముందుగా వారు తమలోని శక్తిని తాము గుర్తించుకోవడం అవసరమని సూచించారు. చరిత్రలో రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహనీయ మహిళలు ఎన్నో అడ్డంకులను అధిగమించి సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఆమె గుర్తు చేశారు.
మహిళలు ఒకరికొకరు తోడుగా నిలిస్తే సమాజంలో గొప్ప మార్పులు సాధ్యమవుతాయని మహిళా కమిటీ సభ్యులు కలిసి మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం వారి ఐక్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే కొనియాడారు. అదేవిధంగా మహిళలు సోషల్ మీడియా, టీవీ సీరియల్స్ వంటి వాటికి ఎక్కువ సమయం కేటాయించకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఇంకా చాలా మంది ఆడపిల్లలు భయం, సందేహాలతో గడప దాటలేని పరిస్థితుల్లో ఉన్నారని వారిని చైతన్య పరిచి ముందుకు తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
అనంతరం నియోజకవర్గ మహిళల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి చూపుతున్న చొరవపై సభలో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 'మహిళా గ్రీవెన్స్' ద్వారా తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభించిన పలువురు మహిళలు తమ అనుభవాలను పంచుకుంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ వేడుకల్లో మహిళా నేతలు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
