
మహిళలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ‘అందం’తో అనుసంధానం చేస్తూ, కొన్ని కులాల మహిళలపై జరిగే లైంగిక నేరాలకు కొన్ని మతగ్రంథాలు ప్రోత్సాహం ఇస్తాయని, వాటిని ‘తీర్థఫలం’గా వర్ణించాయని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్యా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను అధికార బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయనను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దాటియా జిల్లా భాండేర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన బరయ్యా, ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో క్లిప్ శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సమయంలో ఇండోర్‌లో నీటి కాలుష్య విషాద ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన జరుగుతుండటం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
వీడియోలో బరయ్యా మాట్లాడుతూ, దేశంలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. రోడ్డుపై నడుస్తున్న ఓ వ్యక్తి చాలా అందమైన అమ్మాయిని చూస్తే అతని మనసు చెదరిపోవచ్చు. అప్పుడు అత్యాచారం జరగవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో గిరిజనులు, దళితులు, ఓబీసీల్లో ‘అత్యంత అందమైన’ మహిళలు ఎవరు ఉంటారని ప్రశ్నించారు. ఈ వర్గాల మహిళలపై అత్యాచారాలు జరుగడానికి కారణం హిందూ మత గ్రంథాల్లో ఇచ్చిన ఆదేశాలేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఏ గ్రంథంలో ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నాయో చెప్పమని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, బరయ్యా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. అయినా కూడా ఆయన ఓ సంస్కృత శ్లోకాన్ని తనదైన రీతిలో వ్యాఖ్యానిస్తూ కొన్ని కులాల మహిళలతో సంభోగం చేయడం వల్ల ‘తీర్థఫలం’ లభిస్తుందని గ్రంథాల్లో ఉందని పేర్కొన్నారు. యాత్రకు వెళ్లలేకపోతే ఇంట్లోనే ఆ ఫలితం పొందే మార్గం చూపారు. అప్పుడు చీకట్లో ఎవ్వరినైనా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్క వ్యక్తి ఒంటరిగా అత్యాచారం చేయలేడు. మహిళ అంగీకరించకపోతే అతడు చేయడంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
బీజేపీ నాయకుల తీవ్ర విమర్శలు
ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బరయ్యా సామాజిక విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. రాహుల్ గాంధీ ఆయనను పార్టీ నుంచి తొలగిస్తేనే ఇతర వర్గాల పట్ల ఆయనకు గౌరవం ఉందని తెలుస్తుందని యాదవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ ఆశిష్ ఉషా అగర్వాల్ ‘ఎక్స్’లో ఆ వీడియోను షేర్ చేస్తూ, బరయ్యాను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళలను అందం ఆధారంగా తూకం వేయడం, ఎస్సీ–ఎస్టీ మహిళలపై జరిగే ఘోర నేరాలను ‘తీర్థఫలం’గా పేర్కొనడం నేరపూరిత మనస్తత్వానికి నిదర్శనం” అని ఆయన విమర్శించారు. ఇది మహిళలపై, దళితులపై, మానవత్వంపై నేరుగా దాడి. రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌కు వస్తున్న రోజే ఈ వ్యాఖ్యలు రావడం ద్వారా కాంగ్రెస్ అసలు ఆలోచన ఇదేనా? ‘రాజ్యాంగాన్ని రక్షించాలి’ అన్న నినాదంలో ఇదే కపటత్వమా? అని అగర్వాల్ ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి, శాసనసభ ప్రతిపక్ష నేత ఉమాంగ్ సింగ్‌హార్ మౌనంగా ఉండే హక్కు లేదని ఆయన అన్నారు. తక్షణమే క్షమాపణ చెప్పి బహిష్కరించాలి, లేదంటే మహిళ వ్యతిరేక, దళిత వ్యతిరేక ఆలోచనలకు కాంగ్రెస్ మద్దతిస్తోందని అంగీకరించాలని బీజేపీ స్పష్టం చేసింది.
