
మహిళలపై గృహహింస సామాజిక రుగ్మతకు సూచిక: సుప్రీంకోర్టు
మహిళలపై గృహహింస వంటి ఘటనలు ఒకటి రెండు తప్పిదాలుగా కాకుండా సమాజవ్యవస్థలో ఉన్న లోతైన సమస్యల సూచికలుగా చూడాల్సిన అవసరం ఉందని భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పేర్కొంది. దేశంలో మహిళలపై నేరాల గణాంకాలు ఆందోళన కలిగించే స్థితిని చూపిస్తున్నాయని కూడా వ్యాఖ్యానించింది. 2012 అక్టోబరులో భార్యను నిప్పంటించి హత్య చేసిన కేసులో ఒక వ్యక్తికి విధించిన జీవితఖైదు శిక్షను సమర్థిస్తూ శనివారం న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి, అక్షరాస్యత పెరుగుదల, విద్యా-ఉద్యోగ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పటికీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పితృస్వామ్య భావాలు ఇంకా బలంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది.
మహిళలకు హక్కులు లభించడం లేదు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2023లో మహిళలపై 4.48 లక్షలకు పైగా నేరాలు నమోదయ్యాయని కోర్టు గుర్తుచేసింది. అదేవిధంగా, వరకట్న హింస కారణంగా ప్రతి సంవత్సరం 6,000 మందికి పైగా మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. కోర్టు పేర్కొన్నది ఏమిటంటే, రాజ్యాంగం సమానత్వం, లింగవివక్షకు వ్యతిరేక హక్కులు, జీవన హక్కు వంటి మౌలిక హక్కులను హామీ ఇచ్చినా, సమాజంలోని అనేక ప్రాంతాల్లో మహిళలకు అవి పూర్తిగా అందడం లేదు.
ప్రభుత్వం మహిళల సాధికారత కోసం బేటీ బచావో–బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, సామాజిక ధోరణుల్లో మార్పు ఇంకా పూర్తిగా చోటుచేసుకోలేదని ధర్మాసనం పేర్కొంది. చట్టాలు, సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ మహిళలపై హింస కొనసాగుతుండటం సమాజంలో లోతైన సమస్యలను సూచిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. మహిళలపై గృహహింస వంటి ఘటనలు ఒకటి రెండు అపవాదాలు కాదు, అవి సమాజ వ్యవస్థలోని సామాజిక రుగ్మతలకు సూచికలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో దిగువ కోర్టులు మృతురాలి ‘డైయింగ్ డిక్లరేషన్’ ఆధారంగా తీర్పు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మరణం సమీపిస్తున్న సందర్భంలో ఇచ్చే ప్రకటనలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని, అవి విశ్వసనీయంగా ఉంటే దాని ఆధారంగా నిందితుడిని దోషిగా తేల్చవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాక, మహిళల జీవితాలపై నియంత్రణ భావాలు ఇంకా సమాజంలో కొనసాగుతుండటంపై ఆత్మపరిశీలన అవసరమని, దీనికి సమాధానం చివరికి భారత ప్రజలే కనుగొనాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
