Let's talk: editor@tmv.in
మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్

మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్

Gaddamidi Naveen
24 నవంబర్, 2025

రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, ఆత్మనిర్భరులుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో డ్వాక్రా మహిళలకు రూ.590 కోట్ల రుణాలను అందజేయడం జరిగిందని, అలాగే రూ.32 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాల సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసిన ఆయన, 1990లో ప్రారంభమైన ఈ గ్రూపులకు 2004నుంచి 2014 మధ్యకాలంలో పావలా వడ్డీ రుణాలు లభించగా, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు రుణాల పంపిణీ, మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాట్లు, పెట్రోల్ బంకుల మంజూరు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం వంటి కార్యక్రమాలు అమల్లో ఉన్నాయని వివరించారు. మహిళలకు విద్యా అవకాశాలను విస్తరించడం ప్రభుత్వం ప్రధాన కర్తవ్యంగా భావిస్తోందని, మహిళ చదువుకుంటే కుటుంబం బాగుపడుతుందని, కుటుంబాలు బాగుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు.

తెల్ల రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకున్న 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు, పార్టీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ చీరలు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలు మహిళల ఆర్థిక శక్తిని పెంచి, కుటుంబ స్థాయిలో స్థిరత్వాన్ని తీసుకువస్తాయని అన్నారు.

టి.జి.ఐ.సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లాలో డ్వాక్రా మహిళలకు లభిస్తున్న ప్రయోజనాలను వివరించారు.

మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్ - Tholi Paluku