Let's talk: editor@tmv.in
మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి ఆర్కే రోజా

మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి ఆర్కే రోజా

Gaddamidi Naveen
17 ఆగస్టు, 2026

స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను అవమానించేలా మాట్లాడారని, అందుకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు ముందుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు. నగరిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారని తీవ్రంగా విమర్శించారు.

సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుపై మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు ముందుగానే వారిపై ఎదురుదాడికి దిగారని రోజా ఆరోపించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పల్లెవెలుగు బస్సులో మహిళలను తన నివాసానికి తీసుకెళ్లి భోజనాలు పెట్టిన అనంతరం.. వారు ఓటుకు డబ్బులు తీసుకున్నారనే విధంగా మాట్లాడటం అవమానకరమన్నారు. మహిళలు ఎవరు డబ్బులు ఇస్తే వారు తీసుకునే వారిలా చిత్రీకరించడం సరికాదన్నారు. రూ.2 వేలకే ఓటు అమ్ముకున్నారని మహిళలను ప్రశ్నించే ముందు ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి చంద్రబాబు తన రాజకీయ చరిత్రను గుర్తు చేసుకోవాలని రోజా వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు వ్యవహారంపై నీతులు చెప్పడం.. ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

రాజకీయాల్లో డబ్బు వినియోగం చంద్రబాబుదే

రాజకీయాల్లో డబ్బును ఉపయోగించి వ్యవస్థలను ప్రభావితం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని రోజా ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు డబ్బు ఉపయోగించారని, తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో, వీడియో ఆధారాలతో చిక్కుకున్నారని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వంటి రాజకీయాలకు చంద్రబాబే ఆద్యుడని ఆరోపించారు. రాష్ట్ర వనరుల దోపిడీకి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆమె విమర్శించారు. ఇసుక, గ్రావెల్, కంకర, గ్రానైట్ తదితర రంగాల్లో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

హామీలు అమలు చేయాలి

ఎన్నికల సమయంలో మహిళలను ‘అమ్మ, చెల్లి, తల్లి’ అంటూ ఓట్లు అడిగిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారినే డబ్బుకు ఆశపడేవారిగా మాట్లాడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రోజా అన్నారు. చంద్రబాబు, లోకేశ్, మంత్రులు, ఎమ్మెల్యేలు 2029 ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పోటీ చేస్తామని ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు.

మహిళలకు ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెన్షన్, రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ మహిళలకు నెలకు రూ.3 వేల వంటి హామీలను నెరవేర్చాలని కోరారు. మహిళల భద్రత కోసం గతంలో తీసుకొచ్చిన దిశా చట్టాన్ని పునరుద్ధరించాలని, మద్యం, గంజాయి నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.