Let's talk: editor@tmv.in
మహిళలకు ఓఎస్‌సీ కేంద్రాల్లో సహయం ఎందుకు అందడం లేదు: రాహుల్‌గాంధీ

మహిళలకు ఓఎస్‌సీ కేంద్రాల్లో సహయం ఎందుకు అందడం లేదు: రాహుల్‌గాంధీ

Pinjari Chand
6 ఏప్రిల్, 2026

మహిళలపై హింసకు గురైన వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన వన్‌ స్టాప్‌ సెంటర్లు(ఒకేచోట అన్ని సహాయాలు అందించే కేంద్రాలు) (ఓఎస్‌సీస్) పనితీరులో అనేక సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. మహిళల భద్రత అనేది కేవలం ఒక పథకం కాదని, ప్రభుత్వపు మౌలిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎవరి బాధలు వినడం లేదని విమర్శించారు. రాహుల్‌ గాంధీ ఆదివారం తన వాట్సాప్‌ ఛానల్‌లో చేసిన పోస్టులో మహిళలు సహాయం కోసం తలుపులు తడుతున్నా ప్రభుత్వం వాటిని మూసేసిందని వ్యాఖ్యానించారు.

ఒక మహిళ హింస నుంచి తప్పించుకుని వన్‌ స్టాప్‌ సెంటర్‌కు చేరుకున్నప్పుడు ఎందుకు సహాయం అందడం లేదు? అక్కడ తలుపులెందుకు మూసి ఉంటాయి? సిబ్బంది కొరత ఎందుకు ఉంది? దేశవ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ‘అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి’ అనే సమాధానం వచ్చిందని ఆయన అన్నారు. నిజంగా అన్నీ సక్రమంగా ఉంటే ఓఎస్‌సీల పనితీరుపై ఇన్ని సమస్యల వార్తలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. మహిళల భద్రత ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే ఐదుగురిలో ముగ్గురికి సహాయం ఎందుకు అందడం లేదని ఆయన ప్రశ్నించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు కేటాయించిన ప్రతి రూ.100లో కేవలం 60 పైసలే ఓఎస్‌సీలపై ఖర్చు అవుతున్నాయని కూడా ఆయన విమర్శించారు.

మార్చి 27న లోక్‌సభలో అడిగిన ప్రశ్నలో కూడా ఆయన అనేక ఓఎస్‌సీలు మూసివేసి ఉండడం, 24 గంటలు పనిచేయకపోవడం వంటి అంశాలపై వివరాలు కోరారు. గత ఐదేళ్లలో ఓఎస్‌సీల వద్ద సహాయం కోరిన మహిళల సంఖ్య, నమోదు అయిన మహిళలపై నేరాల వివరాలు, రాష్ట్రాల వారీగా అందిన నిధులు, వాటి వినియోగంపై సమాచారం కూడా అడిగారు.

రాష్ట్రాలదే బాధ్యత

దీనికి సమాధానంగా మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్‌‌ తెలిపారు. మిషన్‌ శక్తి పథకంలో భాగంగా ఉన్న ఓఎస్‌సీలు హింసకు గురైన మహిళలకు ఒకేచోట వైద్య సహాయం, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం, పోలీసు సహాయం, కౌన్సెలింగ్‌ వంటి సేవలు అందిస్తాయని చెప్పారు. 2015 ఏప్రిల్‌ 1 నుంచి 2025 డిసెంబర్‌ 31 వరకు దేశవ్యాప్తంగా 13.37 లక్షలకుపైగా మహిళలకు ఈ కేంద్రాల ద్వారా సహాయం అందించామని ఆమె తెలిపారు. ఓఎస్‌సీ పథకం అమలు బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలదేనని చెప్పారు. అదే విధంగా 2020, 2025 సంవత్సరాల్లో నీతి ఆయోగ్ ద్వారా నిర్వహించిన మూల్యాంకనాల్లో ఓఎస్‌సీ పథకం పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు తేలిందని మంత్రి వివరించారు.

మహిళలకు ఓఎస్‌సీ కేంద్రాల్లో సహయం ఎందుకు అందడం లేదు: రాహుల్‌గాంధీ - Tholi Paluku