
మహా శివరాత్రికి 2,243 ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రాకపోకలను సులభతరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రధానంగా శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట, కాళేశ్వరం వంటి ప్రసిద్ధ శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో బస్సులు నడపనున్నారు. శ్రీశైలానికి అత్యధికంగా 781 బస్సులు, వేములవాడకు 416 బస్సులు, ఏడుపాయలకు 249 బస్సులు, కీసరగుట్టకు 326 బస్సులు, కాళేశ్వరానికి 71 బస్సులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
ప్రత్యేక బస్సుల కోసం ముందస్తు బుకింగ్ సౌకర్యాన్ని కూడా టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ http://tgsrtcbus.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.
