
మహాశివరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
Gaddamidi Naveen
11 ఫిబ్రవరి, 2026
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అధికారిక ఆహ్వానం అందింది. 'దక్షిణ కాశీ'గా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఉత్సవాల్లో పాల్గొని, స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ హరీష్, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్ వెంకటేష్ కలిసి ముఖ్యమంత్రిని కోరారు.
అదేవిధంగా, కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా సీఎంను అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనాలు అందించి, ప్రసాదాన్ని అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో జరిగే ఈ వేడుకలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
