Let's talk: editor@tmv.in
మహావీర్ బోధనలు మానవాళికి దిక్సూచి: వైఎస్ జగన్

మహావీర్ బోధనలు మానవాళికి దిక్సూచి: వైఎస్ జగన్

Panthagani Anusha
1 ఏప్రిల్, 2026

జైనుల ఆధ్యాత్మిక గురువు భగవాన్ మహావీరుడి బోధనలు నేటి సమాజానికి అత్యంత ప్రాముఖ్యత కలిగినవని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహావీర్ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహావీర్ చిత్రపటానికి జగన్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

అనంతరం సోషల్ మీడియా వేదికగా జగన్ స్పందిస్తూ.. "మహావీర్ బోధించిన అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహావ్రతాలు మనిషికి నీతిమంతమైన జీవన విధానాన్ని చూపిస్తాయి. ఆయన చూపిన మార్గం ఎప్పటికీ ఆచరణీయం, సమాజానికి నిరంతరం మార్గదర్శకం అని కొనియాడారు. ఈ పవిత్ర దినాన జైన సమాజానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్.కె. రోజా, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డి, ఎస్‌వీ సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, కుందన్ గాంధీ, ప్రవీణ్ ఫౌలముత్తా, ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా మహావీర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సమాజాన్ని మరింత శాంతియుతంగా, సమగ్రంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహావీరుడి విలువలు మానవత్వానికి ప్రతీకలని ఆమె పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సైతం మహావీర్ నివాళులర్పిస్తూ ఆయన జీవితం సత్యం, అహింస, కరుణ అనే మార్గాలను వెలుగులోకి తెచ్చిందని నేటి ఆధునిక కాలంలోనూ అవి ఎంతో ప్రాసంగికమని పేర్కొన్నారు. జైనమతంలోని 24వ తీర్థంకరుడైన భగవాన్ మహావీరుడి జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహించారు.