Let's talk: editor@tmv.in
‘మహాలక్ష్మి’ పథకం ద్వారా రూ.10,000 కోట్ల భారీ పొదుపు!

‘మహాలక్ష్మి’ పథకం ద్వారా రూ.10,000 కోట్ల భారీ పొదుపు!

Gaddamidi Naveen
30 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఇప్పటివరకు రూ.10,000 కోట్ల ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) అధికారికంగా ప్రకటించింది.

28 నెలల ప్రయాణం - 290 కోట్ల ప్రయాణాలు

డిసెంబర్ 9, 2023న ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే ప్రారంభమైన ఈ పథకం, గత 28 నెలల్లో మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ కాలంలో మహిళలు సుమారు 290 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు సాగించారు. ముఖ్యంగా మధ్యతరగతి, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు, కూలీలు, విద్యార్థినులు గతంలో నెలకు ప్రయాణాల కోసం రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు ఆ మొత్తం వారి వద్దే పొదుపుగా మిగులుతుండటం వారి ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాది వేస్తోంది.

పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్య

మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల శాతం 40శాతం నుంచి 67శాతంకి భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 35 లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.

త్వరలో స్మార్ట్ కార్డుల పంపిణీ

ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డును చూపి ఉచిత ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు, ప్రయాణాల డేటాను ఖచ్చితంగా ట్రాక్ చేసేందుకు ఆర్టీసీ త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే మహిళలు సులభంగా ప్రయాణించవచ్చు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరిన్ని కొత్త బస్సులను కూడా అందుబాటులోకి తెస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. మహిళలు విద్య, ఉపాధి, వైద్యం, ఆధ్యాత్మిక యాత్రల కోసం స్వేచ్ఛగా ప్రయాణించేలా ఈ పథకం తోడ్పడుతోందని ఆయన అన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సహకరించిన ఆర్టీసీ సిబ్బందిని ఆయన అభినందించారు. ఉచిత టిక్కెట్ల వల్ల కలిగే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తోంది. దీనివల్ల సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతోందని ఆయ‌న తెలిపారు.

ప్రస్తుతం ఈ పథకం ద్వారా అందుబాటులో ఉన్న‌ 81శాతం బస్సు సర్వీసులు

• పల్లె వెలుగు: 3,278 బస్సులు

• డిస్ట్రిక్ట్ ఎక్స్‌ప్రెస్: 2,039 బస్సులు

• సిటీ ఆర్డినరీ: 1,829 బస్సులు

• సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్: 1,044 బస్సులు

మహాలక్ష్మి పథకం కేవలం ఒక ఉచిత ప్రయాణ పథకం మాత్రమే కాదు, అది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే ఒక గొప్ప మార్గం. మహిళల ఆత్మగౌరవాన్ని, ఆర్థిక స్వవలంబనను పెంచుతూ ఈ పథకం దేశంలోనే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది.