
మహారాష్ట్ర మున్సిపల్ స్థానాల్లో బీజేపీ అనైతిక పొత్తులు
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం కొన్ని స్థానిక పట్టణ సంస్థల్లో బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో పొత్తులు కుదుర్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందిస్తూ, ఇటువంటి కూటములను పార్టీ అధిష్టానం ఆమోదించదని, క్రమశిక్షణకు విరుద్ధమని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన స్థానిక నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
డిసెంబర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం, థానే జిల్లాలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ, కాంగ్రెస్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి ‘అంబర్‌నాథ్ వికాస్ అఘాడీ’ పేరుతో కూటమి ఏర్పాటు చేసి పాలన చేపట్టాయి. ఈ కూటమి ద్వారా బీజేపీ తన మిత్రపక్షమైన శివసేనను పక్కనపెట్టి అధికారం దక్కించుకుంది. అదేవిధంగా అకోలా జిల్లాలోని అకోట్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ, ఏఐఎంఐఎం తో పాటు పలు రాజకీయ పార్టీలతో కలిసి ‘అకోట్ వికాస్ మంచ్’ పేరిట కూటమి ఏర్పాటు చేసింది.
ఈ పరిణామాలపై సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ కాంగ్రెస్ లేదా ఏఐఎంఐఎం తో ఎలాంటి పొత్తులు బీజేపీ అంగీకరించదు. పార్టీ అనుమతి లేకుండా ఎవరైనా స్థానిక స్థాయిలో ఇలా వ్యవహరిస్తే అది క్రమశిక్షణా లోపమే. అలాంటి వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పొత్తులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అకోట్, అంబర్‌నాథ్ ఘటనలు బీజేపీ రాజకీయ తత్వాన్ని బయటపెడుతున్నాయి. అధికారమే లక్ష్యంగా ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి.
అంబర్‌నాథ్‌లో పరిణామాలు
60 సభ్యులున్న అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో శివసేన (షిండే) – 27 సీట్లు, బీజేపీ – 14, కాంగ్రెస్ – 12, ఎన్సీపీ – 4, స్వతంత్రులు – 2 గెలుచుకున్నారు. శివసేన అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీకి నాలుగు సీట్లు తక్కువగా నిలిచింది. అయితే బీజేపీ–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతుతో 32 సీట్లు సాధించి పాలన చేపట్టింది. బీజేపీ కార్పొరేటర్ తేజశ్రీ కరంజులే పాటిల్ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఎన్నికై, శివసేన అభ్యర్థి మణీషా వాలేకర్‌ను ఓడించారు. ఉపాధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ పొత్తును శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది అవకాశవాద రాజకీయాలని విమర్శించింది. శివసేన ఎమ్మెల్యే డాక్టర్ బాలాజీ కినీకర్ ఇది కూటమి ధర్మానికి విరుద్ధం మాత్రమే కాకుండా కాంగ్రెస్-ముక్త భారత్ నినాదానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.
అకోట్‌లో కూటమి
అకోట్ మున్సిపల్ కౌన్సిల్‌లో 35 సీట్లు ఉండగా బీజేపీ – 11, ఏఐఎంఐఎం– 5 ఇతర పార్టీల మద్దతుతో కూటమి బలం 25కి చేరింది. బీజేపీకి చెందిన మాయా ధూలే మేయర్‌గా ఎన్నికయ్యారు. ఉపమేయర్, కమిటీ ఎన్నికలు జనవరి 13న జరగనున్నాయి. ఈ కూటమి అకోలా జిల్లా యంత్రాంగంలో అధికారికంగా నమోదు అయ్యింది. మొత్తానికి స్థానిక సంస్థల్లో బీజేపీ చేసిన ఈ రాజకీయ ప్రయోగాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయగా, పార్టీ అధిష్టానం నుంచి మాత్రం స్పష్టమైన వ్యతిరేక సంకేతాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
12 మంది కొత్త కౌన్సిలర్లను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న వ్యవహారంపై కాంగ్రెస్ కఠిన చర్యలకు దిగింది. గత నెల జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటు చేసినందుకు 12 మంది కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్లు , బ్లాక్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది.
థానే జిల్లాలోని అంబర్‌నాథ్ పట్టణంలో బీజేపీ, కాంగ్రెస్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి పోస్ట్–పోల్ కూటమి ఏర్పాటు చేసి మున్సిపల్ కౌన్సిల్‌లో అధికారాన్ని దక్కించుకున్నాయి. ఈ కూటమికి మొత్తం 31 సీట్లు రావడంతో మెజారిటీ సాధించగా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 27 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా అధికారానికి దూరమైంది. బీజేపీ–కాంగ్రెస్ పొత్తుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, కాంగ్రెస్ పార్టీ తన కేడర్‌పై చర్యలు తీసుకుంది. ఈ మేరకు అంబర్‌నాథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీని పూర్తిగా రద్దు చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ లేఖ ద్వారా తెలియజేసింది. కాంగ్రెస్ గుర్తుపై ఎన్నికైన 12 మంది కౌన్సిలర్లందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొంది. రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే ఈ చర్యకు కారణమని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ శివసేన స్థానిక స్థాయిలో చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా పార్టీ గుర్తులు పక్కనపెట్టి కాంగ్రెస్ కౌన్సిలర్లు, స్వతంత్ర సభ్యులు కలిసి ‘అంబర్‌నాథ్ వికాస్ అఘాడీ’ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్–బీజేపీ మధ్య ఎలాంటి అధికారిక పొత్తు లేదని తెలిపారు. అయితే పార్టీ అనుమతి లేకుండా ఈ ఫ్రంట్ ఏర్పాటు చేసినందున షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఆయన స్పష్టం చేశారు.
డిసెంబర్ 31న స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం, కాంగ్రెస్‌కు చెందిన 12 మంది, బీజేపీకి చెందిన 14 మంది, ఎన్సీపీకి చెందిన 4 గురు కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర సభ్యుడు కలిసి ఈ స్థానిక ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని థానే జిల్లా కలెక్టర్‌కు లేఖ ద్వారా అధికారికంగా తెలియజేశారు.
