
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డుల్లో బీజేపీ పాగా
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,869 సీట్లలో 1,425 సీట్లు గెలుచుకుని, రాష్ట్రవ్యాప్తంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముంబై, పుణె వంటి కీలక నగరాల్లో గెలుపుతో థాక్రేలు, పవార్‌ల రాజకీయ కంచుకోటలను బీజేపీ బద్దలు కొట్టింది. 227 సభ్యులున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో బీజేపీ 89 సీట్లు గెలుచుకుని, మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న థాక్రే కుటుంబ ఆధిపత్యానికి ముగింపు పలికింది. మిత్రపక్షం శివసేన 29 సీట్లు దక్కించుకోగా, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 65 సీట్లు సాధించింది. ఎంఎన్ఎస్‌కు 6 సీట్లు లభించాయి. కాంగ్రెస్–వంచిత్ బహుజన్ అఘాడీ కూటమి 24 సీట్లు సాధించగా, ఏఐఎంఐఎం 8, ఎన్సీపీ 3, సమాజ్‌వాదీ పార్టీ 2, ఎన్సీపీ (ఎస్పీ) కేవలం ఒక సీటుతో సరిపెట్టుకుంది. నవీ ముంబై (65), కల్యాణ్–డొంబివలి (50), మీరా–భాయందర్ (78), నాసిక్ (72), పన్వెల్ (55), పుణె (119), పింప్రి–చించ్‌వాడ్ (84), సొలాపూర్ (87), ఛత్రపతి శంభాజీనగర్ (57), నాందేడ్ (45), నాగ్‌పూర్ (102) మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
పుణెలో పవార్‌ల కంచుకోటను బీజేపీ చెదరగొట్టింది. ఇక్కడ బీజేపీ 119 సీట్లు గెలుచుకోగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 27 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఎన్సీపీ (ఎస్పీ)కి 3, కాంగ్రెస్‌కు 15 సీట్లు దక్కాయి. 151 సభ్యులున్న నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ 102 సీట్లతో ఆధిపత్యం చెలాయించగా, కాంగ్రెస్ కేవలం 34 సీట్లకే పరిమితమైంది. నాసిక్‌లో బీజేపీ 72, శివసేన 26, శివసేన (యూబీటీ) 15, కాంగ్రెస్ 3, ఎన్సీపీ 4 సీట్లు సాధించాయి. ఛత్రపతి శంభాజీనగర్‌లో బీజేపీ 57 సీట్లు గెలుచుకోగా, శివసేన 15, కాంగ్రెస్ ఒక సీటుతో సరిపెట్టుకుంది. ఇతర పార్టీల్లో ముఖ్యంగా ఏఐఎంఐఎం 33 సీట్లు సాధించింది. ప్రచారం లేకుండానే బరిలోకి దిగిన కాంగ్రెస్, భివాండీ (30), చంద్రపూర్ (27), లాతూర్ (43) నగరాల్లో గణనీయమైన విజయాలు సాధించింది. తుది ఫలితాల ప్రకారం బీజేపీ 1,425 సీట్లు గెలుచుకోగా, శివసేన 399, కాంగ్రెస్ 324, ఎన్సీపీ 167, శివసేన (యూబీటీ) 155, ఎన్సీపీ (ఎస్పీ) 36, ఎంఎన్ఎస్ 13, బీఎస్పీ 6, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో నమోదు అయిన ఇతర పార్టీలు 129, గుర్తింపు లేని పార్టీలు 196, స్వతంత్రులు 19 సీట్లు సాధించారు.
ఓటమిని అంగీకరించిన రాజ్ ఠాక్రే
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని పార్టీ అధినేత రాజ్ ఠాక్రే అంగీకరించారు. అయినప్పటికీ మరాఠీ మనుషుల (మరాఠీ ప్రజల) హక్కులు, భాష కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం ‘ఎక్స్’ లో చేసిన పోస్టులో రాజ్ ఠాక్రే, ఈ ఎన్నికలను ‘శివశక్తి వర్సెస్ ధనశక్తి’ మధ్య జరిగిన పోరాటంగా వర్ణించారు. ఎన్నికల్లో ఓటమితో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తన బంధువు, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి ఎంఎన్‌ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. మరాఠీ అస్థిత్వాన్ని కాపాడే శక్తులమని చెప్పుకుంటూ, మూడు దశాబ్దాలుగా థాక్రే కుటుంబానికి కంచుకోటగా ఉన్న బీఎంసీపై పట్టు నిలబెట్టుకోవాలని ఈ కూటమి ప్రయత్నించింది. అయితే 227 సభ్యులున్న బీఎంసీలో శివసేన (యూబీటీ) 65 సీట్లు గెలుచుకోగా, ఎంఎన్‌ఎస్ కేవలం ఆరు సీట్లకే పరిమితమైంది.తన పోస్టులో రాజ్ ఠాక్రే ఎంఎన్‌ఎస్, శివసేన (యూబీటీ) కార్యకర్తలను ప్రశంసిస్తూ, ఈ పోరాటం సులభమైంది కాదని అన్నారు. మన కార్యకర్తలు ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు.
ఎంఎన్‌ఎస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడం బాధాకరం. కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నవారు మరాఠీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, మన కార్పొరేటర్లు తప్పకుండా ప్రశ్నిస్తారని రాజ్ ఠాక్రే తెలిపారు. మరాఠీ ప్రజలు, భాష, అస్తిత్వం కోసం ఈ కూటమి పోరాడిందని ఆయన చెప్పారు. ఈ పోరాటమే మన ఉనికి. ఇలాంటి పోరాటాలు దీర్ఘకాలికమని గుర్తుంచుకోవాలంటూ, ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేస్తామని తెలిపారు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అధికార పార్టీలు మరాఠీ ప్రజలను వేధించే అవకాశాన్ని వదులుకోవని ఆయన ఆరోపించారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మన శ్వాస మరాఠీ అని ఎప్పటికీ మర్చిపోవద్దంటూ పార్టీని, సంస్థను తిరిగి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
